రిటైరైన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వారి పెన్షన్ మంజూరు ప్రక్రియలో పురోగతి గురించి తెలియజేసే సరికొత్త విధానాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.
న్యూఢిల్లీ: రిటైరైన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వారి పెన్షన్ మంజూరు ప్రక్రియలో పురోగతి గురించి తెలియజేసే సరికొత్త విధానాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. పెన్షన్ మంజూరు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ , ఈ మెయిల్ ద్వారా తెలిపే వెబ్ ఆధారిత పెన్షన్ మంజూరు, చెల్లింపు పర్యవేక్షణ వ్యవస్థను 15 కేంద్ర మంత్రిత్వశాఖల్లో చేపట్టింది. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేటప్పుడు ‘భవిష్య’గా పిలవనున్నారు. ఈ విధానంలో పెన్షనర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు వారి మొబైల్ నంబర్, ఈ మెయిల్ వంటి వివరాలను సేకరించి పెన్షన్ మంజూరు ప్రక్రియ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
ప్రభుత్వశాఖల్లో పెన్షన్ల మంజూరు, రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో జాప్యాన్ని గుర్తించడంలో ఈ చర్య దోహదపడనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు విధానాన్ని కేంద్ర హోం, ఐటీ, గణాంక, ఉక్కు, ఆరోగ్య, పట్టణాభివృద్ధి, జౌళి, వాణిజ్యం, సిబ్బంది శిక్షణ వ్యవహారాల వంటి 15 శాఖలతోపాటు ప్రణాళికా సంఘం వంటి విభాగాల్లో చేపట్టింది.