
కూతురికి ఉరేసి.. ఫేస్‌బుక్‌లో వీడియో!
థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి 11 నెలల వయసున్న కన్న కూతురిని దారుణంగా చంపి.. దానికి సంబంధించిన వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలు దాదాపు ఒక రోజంతా ఫేస్‌బుక్‌లో ఉండిపోయాయి. ఆ తర్వాత వాటిని తీసేశారు. ఇలాంటి వీడియోలకు ఫేస్‌బుక్‌లో స్థానం లేదని, అందుకే వాటిని తీసేశామని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వుటిసాన్ వాంగ్‌టాలే అనే ఆ వ్యక్తి తన చిన్నారి కూతురు నటాలీకి తన చేతులతోనే ఉరి వేసేశాడు. ఆ విషయం అంతటినీ ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియోలో చూపించాడు. ఆ తర్వాత తాను కూడా ఆ పక్కనే ఉరేసుకున్నాడు. అతడి వీడియో మాత్రం ఫేస్‌బుక్‌లో లేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు.
భార్య తనను వదిలేయడం, తనను ప్రేమించకపోవడంతో తీవ్రంగా మానసిక వ్యథకు గురయ్యాడని చెప్పారు. తాను అతడితో ఏడాది పాటు కలిసున్నానని, మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత అతడు తనకు మాజీ భర్తతో ఉన్న ఐదేళ్ల కొడుకును కొట్టేవాడని వుటిసాన్ భార్య జిరానుచ్ ట్రిరటానా తెలిపింది. నటాలీని ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన తర్వాత ఏదో జరిగి ఉంటుందని తాను భయపడ్డానని, అతడికి కూతురంటే ఎంతో ప్రేమ ఉన్నా.. తనమీద కోపంతో ఏదైనా చేస్తాడని అనుమానం వచ్చిందని ఆమె చెప్పింది. అనుకున్నట్లుగానే జరగరాని ఘోరం జరిగిపోయింది.