
సృజనాత్మకతకు సంకెళ్లు!
అమెరికాలో పాఠశాల విద్యార్థి అరెస్టు, విడుదల
హూస్టన్: తన సృజనాత్మకతను మెచ్చుకుని మాస్టారు తన చేతిలో బహుమతి పెడతారనుకున్న ఓ విద్యార్థికి చేతులకు సంకెళ్లు వేసిన సంఘటన ఇది. అమెరికాలోని ఇర్వింగ్ నగరంలోని మాక్‌ఆర్థర్ హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థి.. స్కూలు ప్రాజెక్టులో భాగంగా సొంతంగా డిజిటల్ గడియారాన్ని తయారుచేసి పాఠశాలకు తీసుకెళ్లాడు. ముస్లిం విద్యార్థి తెచ్చిన వాచీని ‘టైమ్ బాంబు’గా భావించిన మరో మాస్టారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఉగ్రదాడులంటేనే అమెరికా వణికిపోతున్న ఈ తరుణంలో.. స్కూల్లో ఉగ్రవాది ఉన్నాడని సమాచారం రావడంతో, రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని అరెస్టుచేసి బేడీలు వేసి తీసుకెళ్లారు. విద్యార్థిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్కూలు యాజమాన్యం ప్రకటించింది. తర్వాత అసలు విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని విడుదలచేశారు. విద్యార్థి అరెస్టు, సస్పెన్షన్ వార్తలతో సోషల్‌మీడియాలో అహ్మద్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విద్యార్థిని పొగుడుతూ ట్వీట్‌చేశారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్ సహా ఎంతోమంది ప్రముఖులు అహ్మద్‌ను కొనియాడారు.