
ప్రచార వ్యూహకర్తలకు డిమాండ్
న్యూఢిల్లీ: ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్, లాలూ కూటమి భారీ విజయం సాధించడానికి ప్రశాంత్ కిశోర్ ప్రచార వ్యూహాలు బాగా పనిచేయడంతో ఇప్పుడు రాజకీయరంగంలో ఈ తరహా నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతవరకు వ్యాపార, పారిశ్రామిక రంగాలకే పరిమితమైన ఈ నిపుణులకు బిహార్ ఎన్నికలు రాజకీయరంగంలో కొత్త బాటలు వేశాయి. రాజకీయ పార్టీలు ఈ తరహా నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తరఫున, ఇటీవల బిహార్‌లో నితీశ్ కూటమి తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్, వారికి అద్భుతమైన విజయాలు సాధించి పెట్టడంతో ఆయనకు ఇప్పుడు ఊహించనంత డిమాండ్ ఏర్పడింది.
రాబోయే కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, యూపీ రాష్ట్రాలనుంచి కిశోర్ బృందానికి పలు రాజకీయ పార్టీలనుంచి ఇప్పటికే ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 2017లో యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో ఓక్లాండ్ బ్రిగ్స్ అనే ఓ కొత్త ప్రజాసంబంధాల సంస్థతో ఇప్పటికే ఒక ప్రముఖ రాజకీయ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ యూపీలో కూడా ఓ ప్రధాన రాజకీయ పార్టీతో ఒప్పందంకోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఈ సంస్థ, ప్రచార వ్యూహాలకోసం అంతర్జాతీయ నిపుణుల సాయం కూడా తీసుకుంటోంది. కేవలం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోందని ఓక్లాండ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ప్రశాంత్ కిశోర్ బృందం కూడా రాబోయే రోజుల్లో ఏయే పార్టీలకు పనిచేస్తారన్న విషయాన్ని చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో ఓటర్ల మనోగతాలు మారుతుంటాయని, వారు ఆశిస్తున్నదేమిటో తెలుసుకుని రాజకీయ పార్టీలకు చెప్పడమే ప్రచార వ్యూహకర్తల పని అని అనూప్ శర్మ అనే ప్రజాసంబంధాల కన్సల్టెంట్ వెల్లడించారు.
ప్రస్తుతం ఓటర్లు అభ్యర్థుల గుణగణాలనే కాకుండా పార్టీల విధానాలను కూడా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు రానురాను సంక్లిష్టంగా తయారవుతున్నాయని, ఓ వైపు మీడియా, మరో వైపు సోషల్ మీడియా ప్రజాభిప్రాయాన్ని మార్చడంలో తీవ్ర ప్రభావం చూస్తున్నాయని ఫార్చునా ప్రజాసంబంధాల సంస్థ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ఒక్కోసారి వారు సరిగా అంచనా వేయలేకపోతున్నారని ఆయన చెప్పారు.