
వెళ్లడానికి కాదు.. వెళ్లాక తిరగడానికి
చూసేందుకు కారు మాదిరిగానే కనిపిస్తోంది గానీ.. సైజు పెద్దదిగా ఉంది.
చూసేందుకు కారు మాదిరిగానే కనిపిస్తోంది గానీ.. సైజు పెద్దదిగా ఉంది. పోనీ వ్యాన్ లాంటి వాహనమా అంటే.. టైర్లూ తేడాగా కనిపిస్తున్నాయి. ఏంటిది? ఇది వాహనమే. కాకపోతే భూమ్మీద తిరిగేందుకు ఉద్దేశించింది మాత్రం కాదు. భూతాపోన్నతి, వాతావరణ మార్పులు, అణుయుద్ధ భయం వంటి సమస్యల నేపథ్యంలో ఈ గ్రహాన్ని ఖాళీ చేయకపోతే మానవజాతికి కష్టమే అని ఈ మధ్యే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు గుర్తుందా? ఆ హెచ్చరిక పనిచేసిందని కాదుగానీ.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఏళ్లుగా అంగారకుడిపైకి మనిషిని పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇంకో దశ ఈ వాహనం.
సింపుల్‌గా చెప్పాలంటే అరుణగ్రహంపై వ్యోమగాములు అటు ఇటూ వెళ్లేందుకు సిద్ధం చేసిన వాహనమిది. ఈ మధ్యే కెన్నడీ స్పేస్‌సెంటర్‌లోని విజిటర్స్ కాంప్లెక్స్‌లో దీన్ని ఆవిష్కరించారు. అచ్చంగా ఇదే వాహనం వెళుతుందా? ఊహూ కాదు. వెళ్లే వాహనం ఇలా ఉండవచ్చు. దీంట్లో ఉపయోగించిన అనేక టెక్నాలజీలను వాడవచ్చు. అంతే. ఇక వివరాల విషయానికొస్తే.. ఫ్లారిడా కేంద్రంగా పనిచేస్తున్న పార్క్ బ్రదర్స్ కాన్సెప్ట్స్ అనే సంస్థ సిద్ధం చేసింది దీన్ని. మొత్తం 24 అడుగుల పొడవు ఉండే ఈ వాహనంలో రెండు భాగాలున్నాయి. జీపీఎస్‌తో కూడిన ముందుభాగంలో నలుగురు కూర్చోవచ్చు.
ఇక వెనుకభాగంలో ఒక పరిశోధనశాల ఉంటుంది. అవసరమైనప్పుడు ముందుభాగాన్ని మాత్రమే ప్రయాణానికి ఉపయోగించవచ్చు లేదంటే 700 వోల్టుల విద్యుత్ మోటార్ సాయంతో మొత్తం వాహనాన్ని కూడా కదిలించవచ్చు. అది కూడా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేంత శక్తి ఉంటుంది దీంట్లో. వాహనాన్ని నడిపేందుకు కావాల్సిన విద్యుత్తును ఉపరితలంపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి చేస్తారు. రాళ్లూ, రప్పలపై కూడా నిలకడగా ప్రయాణించేందుకు వీలుగా చక్రాలను అర్ధగోళాకారంలో తయారు చేశారు. అరుణగ్రహంపై సవారీకి రంగం సిద్ధమైందన్నమాట!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్