స్థానికత ఆధారంగానే తుది విభజన | The final division on the basis of localism | Sakshi
Sakshi News home page

స్థానికత ఆధారంగానే తుది విభజన

Published Sun, Jun 7 2015 3:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

The final division on the basis of localism

సాక్షి, హైదరాబాద్ : స్థానికత (పుట్టిన ప్రాంతం) ఆధారంగానే విద్యుత్ సంస్థల ఉద్యోగుల తుది కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్/ నియామక ఉత్తర్వులు/పోలీసుల ధ్రువీకరణ పత్రం(యాంటిసిడెంట్)ను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల తుది కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు లేఖ రాశారు.

అలాగే కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైతం స్థానికత ఆధారంగానే తుది కేటాయింపులు జరపాలని, ఆ మేరకు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించాలన్నారు. కాగా, స్థానికత ఆధారంగానే విద్యుత్ కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తుది కేటాయింపులు జరపాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ స్థానికత కలిగి ఏపీ ప్రభుత్వంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల న్యాయం జరిగిందన్నారు.

 విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుపై ప్రభుత్వ మార్గదర్శకాలివీ...
  ఒకవేళ ఉద్యోగులు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు చెందని వారైతే, అతను/ఆమె విజ్ఞప్తి ఆధారంగా కేటాయింపులు జరపాలి

  రాష్ట్ర విభజన రోజు తర్వాత రిటైరైన/మృతిచెందిన ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్ల కేటాయింపులు సైతం స్థానికత ఆధారంగానే జరగాలి తెలంగాణ, ఏపీల బయట ఉన్న మాచ్‌కుండ్, టీబీ డ్యాం, మినీ హైడల్ తదితర అన్ని ప్రాజెక్టుల్లో 53.89 శాతం పోస్టులను తెలంగాణకు కేటాయించాలి. తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను అక్కడ నియమించేందుకు తెలంగాణ జెన్‌కో చర్యలు తీసుకోవాలి

  నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ డ్యాం విద్యుదుత్పత్తి కేంద్రంలోని అన్ని పోస్టులు తెలంగాణకే కేటాయింపు. తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను అక్కడ పోస్ట్ చేసేందుకు టీ జెన్‌కో చర్యలు తీసుకోవాలి

  ఏపీలో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలి. మిగిలిన ఉద్యోగుల్లో ఈ ఏడు మండలాల స్థానికతగల ఉద్యోగుల వారు తెలంగాణకు రావాలని కోరుకుంటే కేటాయింపు జరపాలి

 ఇద్దరూ ఉద్యోగులు అయితే..
  ఇద్దరు ఒకే రాష్ట్ర స్థానికతను కలిగి ఉంటే ఇద్దరినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలి

  ఒకరు రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తుంటే మరోకరు పీఎస్‌యూ/రక్షణ సంస్థలు/రైల్వే/బ్యాంకింగ్/బీమా/ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం లో పని చేస్తుంటే అలాంటి కేసులను పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ ఉద్యోగాలు జాతీయ స్థాయిలో స్థానచలనం కలిగి ఉంటాయి
 భాగస్వామి వేరే రాష్ట్ర వాసి అయితే విజ్ఞప్తిపై ఇద్దరిని ఒకే రాష్ట్రానికి కేటాయించాలి
  ఐఏఎస్ అధికారుల జీవిత భాగస్వాములను వారున్న రాష్ట్రానికే కేటాయించాలి.    
 
 వ్యక్తిగత సమస్యలున్న ఉద్యోగుల మార్గదర్శకాలు
 వితంతు/చట్టపరంగా విడాకులు పొందిన మహిళా ఉద్యోగులను వారి విజ్ఞప్తిపై కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి
  60%కిపైగా వైకల్యంగల ఉద్యోగులను వారి ఆప్షన్ ఆధారంగా కేటాయించాలి
  ఉద్యోగి, జీవిత భాగస్వామి, సంతానంలో ఎవరైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ/బైపాస్ సర్జరీ, కిడ్నీ మార్పిడి/కిడ్నీ వైఫల్యం లాంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతుంటే ఆ ఉద్యోగినీ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. హైదరాబాద్ బయటి ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకే ఈ అవకాశం కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement