ఎన్నికల వేళ ’బీఫ్’ దుమారం
బిహార్ తుది దశ పోలింగ్ జరిగే చోట్ల బీజేపీ ప్రకటన
♦ బీజేపీ ప్రకటనపై మండిపడ్డ మహాకూటమి.. ఈసీకి ఫిర్యాదు
♦ నేడు 57 స్థానాలకు పోలింగ్.. 8న కౌంటింగ్
పట్నా: బిహార్‌లో చివరిదైన ఐదో దశ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ దశలో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తుది దశ ఎన్నికల పోలింగ్‌కు కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన దుమారం రేపింది. ఓ మహిళ గోవును కౌగిలించుకుని ఉన్నట్టుగా ఉన్న ఈ ప్రకటనలో.. గోమాతను కించపరుస్తూ ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌యాదవ్ సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్ ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది.
గురువారం పోలింగ్ జరగనున్న కిషన్‌గంజ్, సహర్సా తదితర ప్రాంతాల్లోని పత్రికల్లో ఈ ప్రకటన ప్రచురితమైంది. హిందువులు కూడా బీఫ్ తినాలన్న లాలూ వ్యాఖ్యలను.. ఆర్‌జేడీ నేత రఘువంశ్ ప్రసాద్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీఫ్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలను ప్రకటనలో పేర్కొంది. నితీశ్ ఓటు బ్యాంకు రాజకీయాలు కట్టిపెట్టాలని, తన సన్నిహితులు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించింది. జవాబు చెప్పకపోతే ఓటు ఉండదంది. ప్రకటనపై మహాకూటమి మండిపడింది. మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్, జేడీయూ ఆరోపించాయి.
బీజేపీ ప్రకటనపై కాంగ్రెస్, జేడీయూ నేతల బృందం ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేసింది. మత ప్రాతిపదికన ఓట్లు దక్కించుకునేందుకే బీజేపీ ఈ ప్రకటన ఇచ్చిందని ఆరోపించింది. బీజేపీ మాత్రం తమ ప్రకటనలో తప్పు లేదని సమర్థించుకుంది. తుది దశ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలోని 24 స్థానాలతో పాటు మధుబని, దర్భంగ, సుపాల్, మాధేపుర, సహర్స, అరారియా, కిసాన్‌గంజ్ , పూర్నియా, కతిహార్ జిల్లాల్లోని సీట్లలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 8న కౌంటింగ్ జరుగుతుంది.