మళ్లీ ‘మందు’ కల్లు! | The government did not succumb to the pressures of liquor mafia | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘మందు’ కల్లు!

Published Tue, Sep 29 2015 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

మళ్లీ ‘మందు’ కల్లు!

మళ్లీ ‘మందు’ కల్లు!

♦ తిరిగి అల్ఫ్రజోలం, డైజోఫాంతో అమ్మకాలు
♦ కల్లు మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం
♦  కల్లు డిపోలపై దాడులు నిలిపివేయాలంటూ ఆదేశాలు
♦ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, పిచ్చివాళ్లు అవుతున్నారని సమర్థన
♦ డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన తరువాత దాడులు!
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ ‘మందు’ కల్లు వరద మొదలైంది. కల్తీకల్లు కేంద్రాలపై దాడులకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. అల్ఫ్రజోలం, డైజోఫాం వంటి రసాయనాలతో తయారుచేస్తున్న నకిలీ కల్లు మళ్లీ విజృంభిస్తోంది. కల్లు మాఫియా ఒత్తిడి మేరకే దాడులకు స్వస్తి పలకాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ‘కల్తీ కల్లుకు అలవాటు పడ్డ జనాలు ఒక్కసారిగా మానేస్తే పిచ్చివాళ్లవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కల్తీకల్లు డిపోలపై దాడులు నిలిపివేయండి..’ అంటూ వచ్చిన ఆదేశాలను ఎక్సైజ్ ఉన్నతాధికారులు జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్లకు చేరవేశారు. దీంతో మూడు రోజులుగా కల్లు దుకాణాలపై దాడులు నిలిచిపోయాయి. దీంతో తిరిగి అ  ల్ఫ్రజోలం, డైజోఫాం కలిపిన కల్లు విక్రయాలు మొదలైనట్లు సమాచారం.

 జిల్లాలవారీగా దాడులు
 ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్‌గా ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను ప్రభుత్వం నెలరోజుల క్రితం నియమించింది. ఆయన వెంటనే మండలాల వారీగా గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులకు శ్రీకారం చుట్టారు. తర్వాతి వారంలో కల్తీకల్లు దుకాణాలపై దృష్టిపెట్టారు. నిజామాబాద్‌లో మొదలైన ఈ దాడులను ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు విస్తరించారు. పాలమూరు జిల్లాలో 435 సొసైటీల ద్వారా 1,390 కల్లు దుకాణాలు అధికారికంగా నడుస్తుండగా.. అనధికారికంగా మరో వెయ్యి ఉన్నాయి. ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువగా ఉండడంతో అల్ఫ్రజోలంతో కల్లు తయారుచేసి అమ్ముతారు.

ఎక్సైజ్ దాడులు ఊపందుకోగానే అల్ఫ్రజోలం కలపడాన్ని కల్లు వ్యాపారులు నిలిపివేశారు. దీంతో ‘విత్‌డ్రాయల్ సింప్టమ్స్’ తో రోజుకు వందలాది మంది కల్తీకల్లు బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు. కొందరు చికిత్స పొందుతూ చనిపోతే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 53 మంది మృతిచెందారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కృత్రిమ కల్లు విక్రయించే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

 సర్కారు పెద్దల నుంచే ఒత్తిళ్లు..
 కల్తీకల్లు దొరకక జనం మతిభ్రమించి ప్రవర్తించడం, ఉన్మాదంతో చేతులు కోసుకోవడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడడంతో పరిస్థితి చేయిదాటింది. ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోయాయి. దీంతో కల్లు మాఫియా రంగ ప్రవేశం చేసి.. సచివాలయ స్థాయిలో పైరవీ చేసింది. ప్రభుత్వ పెద్దల ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిళ్లు తె చ్చింది. ‘ఒక్కసారిగా మందు ఆపేస్తే జనం చచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన తరువాత దాడులు చేస్తే బాగుంటుంద’ని చెప్పుకొచ్చింది. దీంతో ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాడులు నిలిచిపోయాయి.

 అల్ఫ్రజోలంను గుర్తించడం కష్టం!
 కల్లును కల్తీ చేసేందుకు, తాగినవారు మత్తులో జోగేందుకు కల్లు మాఫియా ఉపయోగించే  రసాయనం అల్ఫ్రజోలం. గతంలో క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోఫాం, క్లోరోఫాంలను ఉపయోగించేవారు. వాటిని దుకాణాల వద్ద వెంటనే గుర్తించవచ్చు. దీంతో కల్తీ కల్లు విక్రయదారులు అల్ఫ్రజోలంను కలపడం ప్రారంభించారు. అల్ఫ్రజోలం కలిపితే ఎక్సైజ్ అధికారులు దుకాణాల వద్ద గుర్తించలేరు. హైదరాబాద్‌లోని ఎక్సైజ్ లేబొరేటరీలో మాత్రమే.. అదికూడా రోజుకు నాలుగు లేదా ఐదు శాంపిళ్లనే పరీక్షించే అవకాశముంది. ఇది కల్తీకల్లు వ్యాపారులకు అనుకూలంగా మారింది.
 
 కల్లు బాధితులు ఎంత మంది?
  కల్తీకల్లు దొరకక ‘విత్‌డ్రాయల్ సింప్టమ్స్’ తో ఆసుపత్రుల పాలైనవారు, చికిత్సపొం దుతూ చనిపోయినవారు, ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. మూడు రోజులుగా కల్తీకల్లు కేంద్రాలపై దాడులు నిలిపివేసినా.. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది ఇంకా కోలుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికి పైగా కల్తీకల్లు బాధితులు ఆసుపత్రుల పాలుకాగా, 100 మంది వరకు చనిపోయినట్లు ప్రాథమిక అంచనా. అసెంబ్లీ సమావేశాల్లో కల్తీకల్లుపై ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పేలా క చ్చితమైన వివరాలను ప్రభుత్వం రాబడుతోంది. దీనిపై పూర్తి వివరాలను అందజేయాలని, ‘విత్‌డ్రాయల్ సింప్టమ్స్’తో చనిపోయిన, చికిత్స పొందినవారి వివరాలను జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారుల నుంచి తీసుకోవాలని... అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement