బ్లూచిప్ కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు
మూడో రోజూ పతన బాటలోనే...
24 మైనస్‌తో 26,813కు సెన్సెక్స్
4 పాయింట్ల నష్టంతో 8,131కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసింది. వాహన, లోహ షేర్ల పతనం కారణంగా గురువారం స్టాక్‌మార్కెట్ 24 పాయింట్లు నష్టపోయి 26,813 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 8,131 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడంతో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్ నష్టాలు తక్కువ స్థాయికే పరిమితమయ్యాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా యూరోప్ మార్కెట్లు పతనం కావడం, డాలర్‌తో రూపాయి మారకం 20 నెలల కనిష్ట స్థాయికి (64.25) క్షీణించడం కూడా ప్రభావం చూపాయి.
లోహ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎంసీజీ, వాహన షేర్లు బలహీనంగా ట్రేడయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్తు, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గ్రీస్ రుణ సంక్షోభంపై నేడు(శుక్రవారం) కీలకమైన ఫలితం తేలనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ మార్కెట్‌పై విశ్లేషించారు.
397 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్
సెన్సెక్స్ 26,941 పాయింట్లతో లాభాల్లోనే ప్రారంభమైంది. గత2 సెషన్లలో బాగా నష్టపోయిన బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లతో 26,949 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 26,552 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ చివర్లో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్, ఆర్థిక సేవల సంస్థల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సెన్సెక్స్ మరీ పతనం కాకుండా అడ్డుకుంది, మొత్తం 397 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
టాటా స్టీల్ 2 శాతం డౌన్
మ్యాగీ వివాదంతో నెస్లే ఇండియా షేర్ 2.8% క్షీణించి రూ.6,011 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో, 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. పెన్షన్ స్కీమ్ విషయమై కార్మిక సంఘాలు సమ్మెకు మొగ్గుచూపుతున్నాయన్న వార్తల కారణంగా టాటా స్టీల్ 2.5 శాతం క్షీణించి 308 వద్ద ముగిసింది. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,681 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,661 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,91,093 కోట్లుగా నమోదైంది.