రాష్ట్రంలో దుర్భిక్షం!
కరువు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది
* రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్ర బృందం
* నివేదికలు సరిగా ఇవ్వలేకపోయారు
* క్షేత్రస్థాయిలో మేం గుర్తించిన చాలా అంశాలు వాటిల్లో లేవు
* కొత్త మార్గదర్శకాలు ఇస్తామని, అనుబంధ నివేదికలు పంపాలని సూచన
సాక్షి, హైదరాబాద్: తాము ఊహించిన దానికంటే తెలంగాణలో కరువు తీవ్రత మరింత ఎక్కువగా ఉందని కేంద్ర కరువు పరిశీలన బృందం ధ్రువీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలు ఆ తీవ్రతను ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో తాము గుర్తించిన చాలా అంశాలు నివేదికలో లేవని, ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లినా ఈ అంశాన్ని ప్రస్తావించనే లేదని పేర్కొంది. ఇలాంటి అన్ని వివరాలతో వారం రోజుల్లోగా అనుబంధ నివేదికలు పంపించాలని సూచించింది.
క్షేత్ర స్థాయిలో కరువు పరిస్థితుల పరిశీలనకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్పల్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారుల బృందం ఈ నెల 7, 8 తేదీల్లో నాలుగు జిల్లాల్లో పర్యటించింది. పంట నష్టాన్ని, అడుగంటిన జలాశయాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. బృందంలోని అధికారులు పలుచోట్ల రైతులతో మాట్లాడి కరువు పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర బృందం మంగళవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయింది.
ఈ సమావేశం సందర్భంగా కేంద్ర బృందం తమ పర్యటనలో గుర్తించిన అంశాలను పేర్కొనడంతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసింది. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రత ఎక్కువగా ఉంది. నివేదికలు సరిగా ఇవ్వలేకపోయారు. క్షేత్రస్థాయిలో మేం తెలుసుకున్న చాలా విషయాలు నివేదికల్లో లేవు. వివిధ జిల్లాల్లో ఉద్యాన పంటలు వేసిన రైతులు భారీగా నష్టపోయారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లినప్పుడు బత్తాయి రైతులు తమకు వాటిల్లిన నష్టంపై గోడు వెళ్లబోసుకున్నారు. వీటిని సైతం జోడించి అనుబంధ నివేదికలు పంపించండి..’’ అని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తదుపరి నివేదికలో ఉండాల్సిన అంశాలు, కరువు నిబంధనల ప్రకారం ఏమేం సమాచారం పొందుపరచాలో వివరించే మార్గదర్శకాలను పంపిస్తామని కేంద్ర బృందం పేర్కొన్నట్లు తెలిపాయి.
మరో నివేదికపై కసరత్తు
రాష్ట్రంలో 231 మండలాల్లో కరువు పరిస్థితులున్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికను పంపిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర బృందం సూచన నేపథ్యంలో ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మరో నివేదికను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది. తగిన సమాచారం అందించాలని ఉద్యాన శాఖను కోరింది.
ఆ వివరాలతోపాటు కరువు దుర్భిక్ష పరిస్థితుల తీవ్రతను ప్రతిబింబించేలా సమగ్ర నివేదికను తయారుచేసి వచ్చే వారంలో కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కరువు మండలాల్లోని రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ. 2,514 కోట్లు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందటి నివేదికలో కేంద్రాన్ని కోరింది. తాజా మార్పులు చేర్పులతో కేంద్రం నుంచి కోరే ఆర్థిక సాయం మరింత పెరిగే అవకాశముం టుందని అధికార వర్గాలు వెల్లడించాయి.