ఊళ్లను గుల్ల చేస్తున్న గుడుంబా! | The Shard gudumba doing! | Sakshi
Sakshi News home page

ఊళ్లను గుల్ల చేస్తున్న గుడుంబా!

Published Sun, Sep 13 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

ఊళ్లను గుల్ల చేస్తున్న గుడుంబా!

ఊళ్లను గుల్ల చేస్తున్న గుడుంబా!

♦ పేదలు, కార్మికుల ప్రాణాలు తీస్తున్న గుడుంబా  
♦ ఊళ్లకు ఊళ్లు గుల్ల.. ఏటా రూ.1,500 కోట్ల దందా!
♦ రోజురోజుకు క్షీణింపజేసి ప్రాణం తీసే విషం

 
 రాష్ట్రంలోని పేదలు, కార్మికుల ప్రాణాలను గుడుంబా రక్కసి కొద్దికొద్దిగా పీల్చేస్తోంది... మెల్లమెల్లగా శరీరాన్ని పీల్చి పిప్పిచేసి జీవచ్ఛవాల్లా మారుస్తోంది... వారి జీవితాల్ని హరిస్తోంది.. గుడుంబాకు బానిసైనవారి భార్యాపిల్లలు, తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి గుడుంబా మహమ్మారి కొద్దినెలలుగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా హాని కలిగించని చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని తొలుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కానీ పలు కారణాల వల్ల దానిపై వెనక్కి తగ్గిన ఆయన... పేదకుటుంబాల్లో చిచ్చు పెడుతున్న గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.

ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు పోలీస్, రెవెన్యూ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మూడు శాఖలను సమన్వయం చేస్తూ గుడుంబాను నిర్మూలించే బాధ్యతను డీఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌కు అప్పగించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆయన కార్యాచరణలోకి దిగడంతో జిల్లాల్లో గుడుంబాపై సమరం మొదలైంది. సారా తయారీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్టు అమలు చేయడం, బైండోవర్ కేసులు నమోదు చేయడం వంటి చర్యలకు ఉపక్రమించారు.

ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ మొదలుకొని డిప్యూటీ కమిషనర్ వరకు క్షేత్రస్థాయిలో ఉండే వాతావరణం కనిపించింది. అయితే దశాబ్దాలుగా గ్రామాల్లో వేళ్లూనుకుపోయిన గుడుంబాను శాశ్వతంగా నిర్మూలించడంపై సాధ్యాసాధ్యాలు త్వరలోనే తేలనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ‘గుడుంబా’పై ‘సాక్షి’ ఫోకస్..             
- సాక్షి, హైదరాబాద్
 
రాష్ట్రంలో ఏరులై పారుతున్న గుడుంబా ప్రజల పాలిట యమపాశంగా మారుతోంది. బెల్లం పానకం చాటున విషతుల్యమైన రసాయనాలను కలిపి తయారుచేసే ఈ నాటు సారా (ఐడీ లిక్కర్) పాలిట పడని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒకసారి గుడుంబాకు బానిసైతే పగలు, రాత్రి, సమయం, సందర్భం వంటివేమీ లేకుండా.. అది తాగితే తప్ప బతకలేమనే స్థితికి దిగజారిపోతారు. కాలేయం సహా అవయవాలు దెబ్బతిని చిన్న వయస్సులోనే చనిపోతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ కి క్కెక్కించే గుడుంబా... మారుమూల పల్లెలు, గిరిజన గూడాలే కాకుండా నగరాలు, పట్టణాలనూ నాశనం చేస్తోంది.

ఎక్సైజ్ అధికారులు అప్పుడప్పుడు జరిపే దాడుల్లోనే ఏటా లక్షలాది లీటర్ల గుడుంబా సీజ్ అవుతుండగా... కోట్ల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేస్తున్నారు. 2014-15లో 17 లక్షల లీటర్ల గుడుంబాను ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. వినియోగమైన గుడుంబా దీనికి 50 రెట్లపైనే ఉంటుందని ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులే పేర్కొంటున్నారు. అంటే దాదాపు 10 కోట్ల లీటర్లకుపైగా జనం వినియోగించేశారని అంచనా. వివిధ ప్రాంతాలను బట్టి లీటర్ గుడుంబా బహిరంగ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.150 వరకు ఉంది. అంటే దాదాపుగా ఏటా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు పేదల సొమ్ము గుడుంబా పాలవుతోంది.

ప్రతి జిల్లాలో కనీసం 100 నుంచి 200 చోట్ల గుడుంబా తయారీ స్థావరాలు ఉండగా.. ప్రతి గ్రామంలో రెండు మూడు చోట్ల విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో గుడుంబా దొరకని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని చోట్ల గుడుంబా తయారీ కుటీర పరిశ్రమ స్థాయిలో కొనసాగుతోంది. ఈ తయారీ కేంద్రాల గురించి ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకూ తెలుసు. మామూళ్ల మత్తు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో గుడుంబాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గుడుంబా విక్రయాలు ఎక్కువ.

 నిండా విషమే
 గతంలో నాటుసారాను ఇప్పపువ్వు, బెల్లం, పండ్లు వంటి వాటితో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రమాదకర తీరులో తయారుచేస్తున్నారు. నల్ల బెల్లం పానకంతో పాటు ఆలం(పటిక), ఈస్ట్ , బ్యాటరీ సెల్స్, కుళ్లిపోయిన పండ్లు, కూరగాయలు, పంటపొలాల్లో చల్లే యూరియా, పాత తోలు చెప్పులు, మిథైల్ ఆల్కహాల్ రసాయనాలను గుడుంబా తయారీకి వినియోగిస్తున్నారు. వీటన్నింటిని కలిపి పులియబెట్టి బట్టీల్లో వేసి మంట పెట్టడం ద్వారా వచ్చే ఆవిరే గుడుంబా. సాధారణంగా గుడుంబా తయారీకి 72 గంటలు (మూడు రోజులు) పడుతుంది. కానీ ఈస్ట్, కుళ్లిపోయిన పళ్లు, కూరగాయలు, బ్యాటరీ సెల్స్ వేయడం ద్వారా తొందరగా పులిసిపోయి 7 నుంచి 10 గంటల్లోనే నాటుసారా తయారవుతుంది. ఇక ఇందులో కలిపే మిథైల్ ఆల్కహాల్ మోతాదులో తేడా వస్తే మరణాలే!
 
 ఎ-కేటగిరీలో కోల్‌బెల్ట్..

 సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతం గుడుంబా వినియోగంలో అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. గోదావరిఖని, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కొత్తగూడెం, భూపాలపల్లి వంటి ప్రాంతాలను ఎక్సైజ్ శాఖ ‘ఏ కేటగిరీ’లో చేర్చింది. సింగరేణి కార్మికులు సాధారణ మద్యంతో పాటు గుడుంబాను కూడా భారీగా వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో తేలింది. సింగరేణి కోల్‌బెల్ట్ పరిధిలో కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి ఓ ప్రత్యేకత ఉంది. పదికిపైగా భూగర్భ గనులు, పెద్దసంఖ్యలో ఓపెన్‌కాస్ట్ గనులు ఉన్నాయి.

వేలాది మంది కార్మికులు, ఎన్టీపీసీ ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఇక్కడ అధికం. ఇక్కడ మద్యం వినియోగం చాలా ఎక్కువ. దాంతోపాటు గుడుంబా విక్రయాలూ భారీగా జరుగుతాయి. గోదావరిఖనికి చెందిన ఓ ఎక్సైజ్ అధికారి చెప్పిన లెక్కల ప్రకారమే గోదావరిఖని ప్రాంతంలో గుడుంబా అడ్డాలు 500కు పైగానే ఉన్నాయి. దానికితోడు మంథని, పెద్దపల్లి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి గుడుంబా తీసుకువచ్చి విక్రయిస్తారు.
 
 పేదలు, కార్మికులే వినియోగదారులు
 కూలీ చేసుకుని బతికే పేదలు, కార్మికులే గుడుంబా తయారీదారుల, విక్రేతల టార్గెట్. రోజుకు రెండు మూడు వందలు సంపాదించుకునే కూలీలు అందులో సగం దాకా గుడుంబా కోసమే ఖర్చుపెడుతున్నారు. దానికి బానిసై, శారీరకంగా బలహీనులైపోయి... ఆ తర్వాత సంపాదించే శక్తి కూడా కోల్పోతున్నారు, జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేట ప్రాంతం నగరంతో పాటు శివార్లకు గుడుంబా సరఫరా చేసే కేంద్రంగా వెలుగొందుతుంటే... అన్ని జిల్లాల్లో మండల కేంద్రాలు, గ్రామాలు, తండాలు కుటీర పరిశ్రమలుగా వర్థిల్లుతున్నాయి!

 ఆ చావులకు లెక్కల్లేవు
 స్లో పాయిజన్‌లా మెల్లమెల్లగా శరీరాన్ని పీల్చిపిప్పిచేసే గుడుంబా కారణంగా ఏటా వందలాది మంది చనిపోతున్నారు. దీనికి ఎలాంటి లెక్కలూ లేవు. గుడుంబా మహమ్మారి మనిషిని మెల్లమెల్లగా చంపుతుంది. దీనికి అలవాటైనవారు రోజూ గుడుంబా తాగకుండా ఉండలేని స్థితికి చేరుకుంటారు. ఉద్యోగం, తిండి, కుటుంబం ఏమీ పట్టదు. 100 ఎంఎల్ వరకు ఉండే గుడుంబా పొట్లం (ప్యాకెట్) తాగడం, పడుకోవడం... లేచిన వెంటనే మరో ప్యాకెట్ తాగడం ఇదే తంతు. ఇలా తాగి తాగి శరీరంలోని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు వదులుతున్నారు. కానీ గుడుంబా తాగడం వల్లే చనిపోయాడని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు ఉండవు. గ్రామాల్లోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరువు కోసం గుడుంబా వల్ల చనిపోయినట్లుగా చెప్పకుండా.. అనారోగ్యంతో చనిపోయినట్లుగా చెబుతుంటారు.
 
 ఇంటింటా సారా బట్టీలే!
  మహబూబ్‌నగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న బోయపల్లి గ్రామ శివార్లలోని జైనందిపూర్ తండా గుడుంబా తయారీకి పేరుమోసింది. ఇక్కడున్న దాదాపు 200 కుటుంబాల్లో సగం వరకు గుడుంబా తయారీపైనే ఆధారపడి ఉంటారు. వారి పొలాల్లోనే బట్టీలు పెట్టి సారా తయారుచేస్తారు. ఇది మహబూబ్‌నగర్, చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా అవుతుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,331 గ్రామాలు ఉంటే వాటిలో 800 గ్రామాల్లో గుడుంబా అందుబాటులో ఉంటుంది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట వంటి మున్సిపాలిటీల్లోనూ గుడుంబా అడ్డాలు అందుబాటులో ఉన్నాయి.

పేద జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌లో గుడుంబాతో పాటు కల్తీకల్లు విక్రయాలూ అధికమే. నిరక్షరాస్యత, కరువు, పేదరికమే దీనికి కారణం. ఇక వరంగల్ జిల్లా గోవిందరావు పేట మండలంలో గుండ్లవాగు ప్రాజెక్టు పరిసరాల్లోని తండాల్లో సగం వరకు కుటుంబాలు గుడుంబా తయారీపైనే ఆధారపడేవి. కొద్దిరోజులుగా పోలీసుల దాడులు పెరగడంతో సారా తయారీ కొంతవరకు తగ్గింది.
 
 గుడుంబాను నిర్మూలిస్తాం..
 ‘‘రాష్ట్రంలో ప్రజలకు ప్రాణాంతకంగా మారిన గుడుంబాను నిర్మూలించడమే మా ధ్యేయం. సీఎం ఆదేశాల మేరకు ఎక్సైజ్‌తో పాటు పోలీస్, రెవెన్యూ శాఖలు కూడా గుడుంబా అడ్డాలపై దాడులు చేస్తున్నాయి. గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయడం, మళ్లీ తయారు చేయకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ప్రజలను చైతన్యపరుస్తూ కరపత్రాలు, లఘు చిత్రాల ద్వారా ప్రచారం చేస్తాం. ఎక్కడికక్కడ స్థానికులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్‌గా నియమితులైన అకున్ సబర్వాల్ పూర్తిగా ఈ బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాల్లో గుడుంబాకు బానిసైన వారికి డీ- అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స చేయిస్తాం’’
 - చంద్రవదన్, ఎక్సైజ్ కమిషనర్
 
 బాబు హయాంలో గుడుంబాకు ప్రోత్సాహం!
 ‘‘చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రాష్ట్రాన్ని పాలిస్తున్న రోజులవి. హైదరాబాద్ శివార్లలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఒకరిద్దరు దొంగలు ఎన్‌కౌంటర్ అయ్యారు కూడా. ఆ సమయంలో తమకు చిక్కిన పాలమూరు జిల్లాకు చెందిన దొంగలకు రంగారెడ్డి జిల్లా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘దోపిడీలు మానండి. మాకు పట్టుబడితే ఎన్‌కౌంటరే. దాని బదులు మీ ఊళ్లకు వెళ్లి గుడుంబా తయారు చేసుకొని బతకండి. పోలీసులు మీ జోలికి రాకుండా మేం చూస్తాం’ అంటూ ‘పునరావాసం’ కల్పించారు.

గుడుంబా తయారీపై ధూల్‌పేటలో శిక్షణ ఇప్పించి మరీ జడ్చర్ల సమీపంలోని తండాకు పంపారు. వారిని వేధించవద్దని ఎస్పీకి ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఆ తండాలో ప్రారంభమైన గుడుంబా తయారీ ఇప్పటికీ కొనసాగుతోంది. పేరుమోసిన స్టూవర్ట్‌పురం దొంగలకు కూడా అప్పట్లో ఇలాంటి ‘పునరావాసం’ లభించింది’’ అని పలువురు మాజీ అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement