మూడోరోజూ తగ్గిన మార్కెట్
67 పాయింట్ల నష్టంతో 26,780కు సెన్సెక్స్
24 పాయింట్ల నష్టంతో 8,108కు నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు నిస్తేజంగా ఉండటంతో వరుసగా మూడో రోజు స్టాక్ సూచీలు నష్టాలపాలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 67 పాయింట్లు క్షీణించి 26,780 పాయింట్లు వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,108 పాయింట్ల వద్ద ముగిశాయి. టెక్నాలజీ, వాహన, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి.
మూడు రోజుల్లో 300 పాయింట్లు డౌన్
చైనా ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండడం, కమోడిటీ ధరలు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతున్నాయని విశ్లేషకులంటున్నారు. బుధవారం 26,760 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమైంది. 26,869, 26,713 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 67 పాయింట్ల నష్టంతో 26,780 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయింది. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరగడం, ఈ వారంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గణాంకాలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడం ప్రభావం చూపాయి.
టీసీఎస్ 4.3 శాతం డౌన్..
30 సెన్సెక్స్ షేర్లలో 15 షేర్లు నష్టాల్లో ముగిశాయి.మంగళవారం వెల్లడైన టీసీఎస్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఈ షేర్ 4.3 శాతం నష్టపోయింది.
13% సబ్‌స్క్రైబ్ అయిన కాఫీ డే ఐపీఓ
కాఫీ డే ఐపీఓ తొలి రోజు 13% సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారం ప్రారంభమై శుక్రవారం(ఈ నెల16న) ముగిసే ఈ ఐపీఓ ద్వారా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.1,150 కోట్లు సమీకరించనున్నది.
మార్కెట్ డేటా...
టర్నోవర్ (రూ.కోట్లలో)
బీఎస్‌ఈ 3,293
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ విభాగం) 14,721
ఎన్‌ఎస్‌ఈ(డెరివేటివ్స్) 1,42,133
నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో)
ఎఫ్‌ఐఐ 122
డీఐఐ -208
26న ఇండిగో ఐపీఓ !
ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఐపీఓ ఈ నెల 26న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజుల పాటు ఉండే (ఈ నెల 28న ముగిసే)ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.