అక్కడ కూడా..!
లండన్: మన సౌర మండలానికి బయట.. వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. గ్రహాన్ని పోలిన పీఎస్‌ఓ జే318.5-22 అనే ఈ ఆవరణ భూమికి 75 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యరహిత మండలంలో ఉంది. వేడి ధూళి, ఇనుప ద్రవ బిందువులతో కూడిన మేఘాల పొరలు అక్కడున్నాయని పరిశోధకులు తెలిపారు. సుదూర రోదసిలో నివాసయోగ్యమైన గ్రహాలను కనుక్కోడానికి ఈ అధ్యయన ఫలితాలు దోహదపడొచ్చని పేర్కొన్నారు.
ఎడిన్‌బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం చిలీలోని టెలిస్కోపు ద్వారా దీన్ని గుర్తించింది. పీఎస్‌ఓ జే318.5-22 దాదాపు 2 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని అంచనా. ఇది పరిభ్రమించినప్పుడు దీని కాంతిలో తేడాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇది గురుగ్రహమంత పరిమాణంలో ఉందని, అయితే ద్రవ్యరాశి మాత్రం ఎనిమిదింతలు ఎక్కువని, అక్కడి మేఘాల్లో 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని పేర్కొన్నారు.