
ఏపీ ప్రభుత్వం నుంచి ఏ తప్పూ జరగలేదు:ఎర్రబెల్లి
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం నిర్వహించాలని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులతోపాటు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నాయకులు గురువారం ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.దీనిలో భాగంగానే ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ విద్యుత్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి తప్పూ జరగలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒకవేళ ఆ ప్రభుత్వం నుంచి పొరపాట్లు జరిగి ఉంటే ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. అలా చేస్తే తామే ఏపీ సర్కారును నిలదీస్తామన్నారు. కరెంటు, రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నివేదక అందలేదని కేంద్ర మంత్రులు తెలిపినట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపి రైతులను ఆదుకోవాలని తెలిపారు.