
కలెక్టర్ కావాలనుకుని.. కటకటాల్లోకి
ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. కలసి చదువుకున్నారు. కలెక్టర్ కావాలని కలలు కన్నారు. ఆశయం నెరవేరకపోయినా మంచి ఉద్యోగాల్లోనే స్థిరపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆశించారు. ఐతే మూడు నెలల క్రితం జరిగిన ఓ బలవంతపు పెళ్లి.. వీరిద్దరితో పాటు మరొకరి జీవితాన్ని చిన్నాభిన్నం చేయగా, మరొక నిండు ప్రాణం బలైంది. ప్రియుడి సహకారంతో భర్త (ఆర్టీసీ ఉద్యోగి) గొంతుకోసి దారుణంగా హతమార్చిన సంఘటనలో అరెస్టయిన సౌజన్య కేసులో వెలుగు చూసిన విస్తుగొలిపే విషయాలవి. వివేకం కోల్పోయి హంతకులుగా మారిన సంఘటన ఇది. కలెక్టర్ కావాలనుకున్న ప్రేమికులిద్దరూ చివరకు కటకటాలపాలయ్యారు.
బీఎస్సీ బయోటెక్నాలజీ చదివిన సౌజన్య కలెక్టర్ కావాలనే ఆశయంతో శిక్షణ తీసుకుంది. ఆమె ఆశయం నెరవేరకపోయినా ఉన్నత ఉద్యోగంలోనే స్థిరపడింది. నెలకు 50 వేల రూపాయిలు సంపాదిస్తోంది. తన స్నేహితుడు, ప్రియుడు జైదీప్ను పెళ్లి చేసుకోవాలన్నది ఆమె కోరిక. ఐతే వారిద్దరి జీవితాలను ఓ సంఘటన ఊహించని మలుపులు తిప్పింది. ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్న మల్కాజ్‌గిరికి చెందిన వెంకటేశ్వరరావు (27)కు నాచారం ప్రాంతానికి చెందిన సౌజన్య అక్క లతతో పెద్దలు మే 29న పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ సరిగ్గా ఒక్కరోజు ముందు లత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటికే పెళ్లి పత్రికలు వెళ్లిపోయాయి. తెల్లారితే పెళ్లి.. లత ఆచూకీ లేదు. పెళ్లి ఆగిపోతే తన తండ్రి గుండె పగిలి చనిపోతాడనే భయంతోనే సౌజన్య ఇష్టం లేకున్నా వెంకటేశ్వరరావుతో అదే ముహూర్తానికి బలవంతపు పెళ్లికి అంగీకరించింది. బెంగళూరులోని అసెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సౌజన్య ఇంజనీర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన తర్వాత సౌజన్య తన పేరును లతగానే చెప్పుకుంది. అయితే పెళ్లికూతురు మారిన విషయం వెంకటేశ్వరరావుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ తెలియదు.
పెద్దలు బలవంతం చేయడంతో వెంకటేశ్వరరావును సౌజన్య పెళ్లయితే చేసుకుంది కానీ సౌజన్య మనసు మాత్రం తన కంపెనీలోనే పనిచేసే ప్రియుడు జైదీప్ (24)పైనే ఉంది. ఎలాగైనా వెంకటేశ్వరరావును వదులుకుని జైదీప్ వద్దకు వెళ్లాలని సౌజన్య కలలు కంది. ఈ క్రమంలోనే హత్యకు పథకం పన్నింది. ఘటనకు మూడు రోజుల ముందు ‘నా భర్త వెంకటేశ్వరరావు హత్యకు గురైనట్లు శుభవార్త త్వరలోనే వింటావు’ అని జైదీప్‌కు వాయిస్ ఎస్‌ఎమ్‌ఎస్‌ను సౌజన్య పంపింది. పథకంలో భాగంగానే ఈ నెల 14న సంఘీ దేవాలయానికి బైక్‌పై దంపతులు వెళ్లి వస్తుండగా దారిలో జైదీప్, అతని స్నేహితుడు రాజ్‌కుమార్ అడ్డగించి వెంకటేశ్వరరావు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
భార్య అతని కాళ్లు గట్టిగా పట్టుకోగా, రాజ్‌కుమార్ అతని చేతులు బలంగా పట్టుకున్నాడు. పదునైన కత్తితో జైదీప్ అతని గొంతు కోశాడు. కేసును తప్పుదారి పట్టించేందుకు తనపై కూడా దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని సౌజన్య పోలీసులను నమ్మించింది. సౌజన్య సెల్‌ఫోన్ కాల్‌లిస్టు ద్వారా జైదీప్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు లోతుగా విచారించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు ఆభరణాలు, సౌజన్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించడంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు కీలక పాత్ర పోషించారని ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ పేర్కొన్నారు.