ఈ డీల్ తో ఫ్లిప్ కార్ట్ కు 1.5 బిలియన్ డాలర్లు
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, అమెరికా దిగ్గజం అమెజాన్ కు, చైనా దిగ్గజం అలీబాబాకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.. అమెజాన్, అలీబాబాలకు చెక్ పెట్టేందుకు 1.5 బిలియన్ డాలర్ల(రూ.9808కోట్లకు పైగా) ఫండింగ్ ను పొందడానికి చర్చలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈబే, చైనా టెన్సెంట్ కంపెనీలు ఈ లావాదేవీలో ముందంజలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే, వ్యూహాత్మక పెట్టుబడిదారుల కూటమితో ఈ ఇద్దరి ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వనుంది. మూడో ఇన్వెస్టర్ కోసం కూడా కంపెనీ అన్వేసిస్తుందని, ఈబేతో చర్చలు తుదిదశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ డీల్ లో ఫ్లిప్ కార్ట్ ఈబే ఇండియా బిజినెస్ లను తనలో కలుపుకోవడం లేదా కొనుగోలు చేయడం చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఈబే కాని, ఫ్లిప్ కార్ట్ కాని ఎలాంటి స్పందన తెలుపలేదు. 400, 500 మిలియన్ డాలర్లను ఈబే ఫ్లిప్ కార్ట్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా ఆన్ లైన్ రిటైల్ ఇండస్ట్రి 15-16 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా, చైనీస్ కంపెనీలకు ప్రస్తుతం భారత్ మార్కెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. అయితే వాటికి చెక్ పెడుతూ దేశీయ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇండియా ఈ-కామర్స్ ఇండస్ట్రిలో ముందుకు దూసుకెళ్తోంది. గతంలో కూడా ఈ కంపెనీ 15.2 బిలియన్ డాలర్లు విలువైన పెట్టుబడులను ఆర్జించింది. ఈ తాజా డీల్ తో కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.65,395కోట్లు), 12 బిలియన్ డాలర్ల(రూ.78,465కోట్లు)కు ఎగుస్తుందని తెలుస్తోంది.