ఈ-పంచాయతీలకు శ్రీకారం
కామారెడ్డి: పల్లె గడపకు పౌరసేవలు సులభంగా అందిచేందుకు ఈ-పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనన, మరణ ధ్రువపత్రాల నుంచి పహాణీలు, కరెంట్ బిల్లుల చెల్లింపుల దాకా ఎన్నో సేవలను వీటిద్వారా పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాబోయే రోజుల్లో పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులు సైతం అక్కడే లభిస్తాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేటలో శుక్రవారం ఈ-పంచాయతీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పల్లె గడపకు పౌరసేవలు అందించేందుకే ఈ-పంచాయతీలను ప్రారంభిస్తున్నామని, ఈ రోజు 104 పంచాయతీల్లో ప్రారంభించి, నెలాఖరుకు 700 గ్రామాలకు విస్తరిస్తామని చెప్పా రు. ఈ-పంచాయతీ అంటే ఎలక్ట్రానిక్, ఈజీ, ఎఫీషియెన్సీ పంచాయతీ అని వివరించారు. రాష్ట్రంలో 8,770 పంచాయతీలు, 25 వేల జనావాసాలు ఉన్నాయని.. 60 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని పేర్కొన్నారు.
వారంతా తమకు కావలసిన సేవల కోసం మండల కేంద్రాలకు తిరగాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే అన్నిరకాల సేవలు పొందవచ్చని మంత్రి చెప్పారు. సమర్థవంతమైన సేవలందించేందుకే ఈ-పంచాయతీలను ప్రారంభించామన్నారు. వీటి నిర్వహణకు ఆయా గ్రామాల మహిళలను నియమిస్తున్నామని... వారికి కనీసం రూ.5 వేలకు తగ్గకుండా ఆదాయం కల్పించనున్నామని తెలిపారు. ఇక్కడ 60 రకాల పౌరసేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
సిగ్గులేకుండా విమర్శలు
‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలే అయింది. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం పొందుతుంటే... ఓర్వలేని కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారు..’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేళ్లుగా పాలించినోళ్ల పాపాలను కడిగేస్తూ, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. సభకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షత వహించగా, మంత్రి పోచారం, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.