3రోజుల క్రితమే రాష్ట్రపతి పేరు చెప్పేశాడు!
వచ్చే నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు సైతం వెలుగులోకి వచ్చాయి. అయితే, అందరినీ విస్మయపరుస్తూ ప్రధాని మోదీ తనదైన స్టైల్‌లో ఎవరూ ఊహించని వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. బిహార్ గవర్నర్, ప్రముఖ దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకు ఎవరీ రామ్‌నాథ్ కోవింద్, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటన్న దానిపై ఒకవైపు నెటిజన్లు సెర్చ్ చేస్తుండగా.. ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
లలిత్ మిశ్రా అనే ఓ ట్విట్టర్ యూజర్ సరిగ్గా మూడురోజుల కిందటే బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి రావొచ్చు అంటూ అంచనా వేశారు. ఆయన అంచనానే నిజమైంది. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి పేరును కరెక్టుగా అంచనా వేసిన ఆయనను ‘దేవుడి’గా అభివర్ణిస్తూ.. షేర్ మార్కెట్ ఫలితాలు ఎలా ఉంటాయి? మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి లలిత మిశ్రా ఇప్పుడు ట్విట్టర్‌లో పాపులర్ అయ్యాడు.
I think Bihar governor Mr Ramnath Kovind is also a dark horse
— Lalit Mishra (@lalit_kmishra) 16 June 2017