సోనియాకు నితీష్ ఝలక్.. మోదీకే జై
పట్నా: అనుకున్నదే అయింది. కేంద్రంలో విపక్షాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి షాకిస్తూ ప్రధాని నరేంద్రమోదీకే జై అన్నారు. ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రామ్‌నాథ్ కోవింద్‌కు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మహాగట్బందన్ (జేడీయూ, ఆర్జేడీ,కాంగ్రెస్) బంధానికి బీటలు వారిన పరిస్థితి ఏర్పడినట్లయింది. వాస్తవానికి నితీష్ తమకే మద్దతిస్తాడని ముందునుంచి కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.
ఆయన మద్దతిస్తాడే లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దళిత వర్గానికి చెందిన మీరాకుమార్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించాలనుకుంది. కానీ, ఆయన తాజా నిర్ణయంతో కాంగ్రెస్ ఆశలకు గండికొట్టినట్లయింది. కేంద్రం పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు నిర్వహించినప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఏ ప్రకటన చేసినా దానిని నితీష్ కుమార్ తెగ పొగుడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించగా వారిలో భాగస్వామ్యం అయి ఉన్న జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న నితీష్ కుమార్ బహిరంగంగా మద్దతిచ్చారు.
అలాగే, జీఎస్టీకి మద్దతిచ్చిన రాష్ట్రాల్లో అన్నింటికంటే బీహారే ముందుంది. ప్రధాని మోదీ కూడా నితీష్‌ను తెగ పొగుడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా నితీష్ మరోసారి ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో తిరిగి ఆయన తన పాత మిత్ర కూటమికి దగ్గరవుతున్నారా అని చర్చ ఊపందుకుంది. అంతేకాకుండా, నితీష్ ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉన్న లాలూ కుటుంబం లక్ష్యంగా అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తుల పేరిట పలు దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.