సర్కారీ వైద్యమే సూపర్ అనాలి
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు...’ అని పాటలు పాడుకునే జనం కచ్చితంగా సర్కారు దవాఖానలో వైద్యం చేయించుకుంటాం.. అనే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులకు మంచిపేరు తేవాల్సిన బాధ్యతను వైద్యులే తీసుకోవాలని సూచించారు. చాలినన్ని నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పీహెచ్‌సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగుపడాలన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న మాట ప్రజల నుంచి రావాలని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్, గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఖాళీగా ఉన్న డాక్టర్, ఇతర పోస్టులను వంద శాతం భర్తీ చేస్తామన్నారు. వైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. చీపురు కొనాలన్నా సెక్రటేరియట్ అనుమతి తీసుకోవాల్సిన దుస్థితిని తొలగిస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌పై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో పునఃసమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎంపీ బి.వినోద్ కుమార్, సీఎస్ రాజీవ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆసుపత్రుల వారీగా బడ్జెట్..
ఆసుపత్రుల వారీగా బడ్జెట్ కేటాయించాలని సీఎం నిర్ణయించారు. కేటాయించిన డబ్బులను వినియోగించుకునే హక్కును సూపరింటెండెంట్లకు ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వరకు తన పరిధిలో పనులను తామే చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. ‘‘ఆసుపత్రుల వారీగా నిర్వహణ నిధులు కేటాయించి, నెలవారీగా వాటిని విడుదల చేయాలి. ఆ డబ్బులతో బెడ్స్, ఆసుపత్రి ప్రాంగణం, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. మంచినీటి సౌకర్యం అందించాలి’’ అని సీఎం ఆదేశించారు.
ప్రతినెలా 25లోగా ఈ నిర్వహణ వ్యయం ఆసుపత్రులకు అందేలా చూడాలని పేర్కొన్నారు. హాస్పిటళ్లలో కావాల్సిన పరికరాలన్నీ కొనివ్వాలని సీఎం నిర్ణయించారు. పరికరాల కొనుగోలుకు రాష్ట్రస్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్, పబ్లిక్ హెల్త్ డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌లతో కూడిన కమిటీ రేట్లు ఖరారు చేసి, నాణ్యతను నిర్ణయించాలని ఆదేశించారు.
మారుమూల ప్రాంత డాక్టర్లకు వెసులుబాటు
‘‘గ్రామీణ, ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి అదనపు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలి. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన సడలించి పక్క పట్టణంలో ఉండే అవకాశం కల్పించాలి. పీహెచ్‌సీలో వైద్యుల సంఖ్యను పెంచి షిప్ట్ సిస్టంలో పని చేయిం చాలి’’ అని కేసీఆర్ వివరించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను వైద్య విధాన పరిషత్‌లోకి తెచ్చి, పీహెచ్‌సీలను పబ్లిక్ హెల్త్ పరిధిలోనే ఉంచాలన్నారు. 108, 104 సేవలను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
పరీక్షల బాధ్యత సర్కారుదే: ప్రైవేటు డయాగ్నసిస్ సెంటర్లు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే ఆసుపత్రుల స్థాయిని బట్టి రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలన్నారు. ఇందుకు ఆసుపత్రుల్లో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సహా పరికరాలన్నీ ఉంచాలన్నారు. మందులు ఉచితంగా అందజేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విరివిగా జెనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించాలని ఆదేశించారు.
విద్యుత్తు సంస్థలపై పడే భారం భరిస్తాం
రైతులు, ఇతర వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల వల్ల విద్యుత్ సంస్థలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా ప్రైవేటు కంపెనీలకు విద్యుత్తు ఉత్పత్తి అప్పగించలేదని, జెన్‌కోకు మాత్రమే ఆ అవకాశం ఇచ్చామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, అప్పుడు జెన్‌కో లాభాలు గడిస్తుందని, దాని ఫలితం ప్రజలకు దక్కుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కట్టాల్సిన విద్యుత్ బకాయిలు వంద శాతం వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వాటికి ప్రీపెయిడ్ మీటర్లు పెడతామని చెప్పారు.
ప్రజాపంపిణీలో అక్రమాలు అరికట్టాలి
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు, దుర్వినియోగం అరికట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. పేదలకు చేరాల్సిన సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని, పౌర సరఫరాల శాఖలో అన్ని విభాగాలు కుమ్మ క్కవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. దుబారా తగ్గాలని, నిత్యావసరాల ధరలు పెరిగితే పౌరసరఫరాలశాఖ జోక్యం చేసుకుని ప్రజలకు సరుకులందించాలన్నారు.