మరో అవకాశం కల్పించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాత పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కారం పథకాన్ని పొడిగిస్తున్నట్టు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం ప్రకటించింది. గతంలో డిసెంబరు 31 వరకు విధించిన గడువును జనవరి 31,2017 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాత లావాదేవీలకు సంబంధించి, ప్రత్యక్ష పన్ను వివాదాలను జనవరి 31లోపు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా ఈ ప్రత్యేక పథకం 2016 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. జూన్ 1 న పరిచయం చేయగా ఒక్క కంపెనీ కూడా పన్ను వివాద లావాదేవీని పరిష్కరించుకోలేక పోవడంతో ప్రభుత్వం ఈ పథకానికి గడువు పెంచింది. మరో అవకాశాన్ని కల్పిస్తూ డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.