ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు ముస్లింల మద్దతు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఏవిధంగా విజయం సాధించిందని మత పెద్దలతో పాటు ప్రత్యర్థులు బుర్రలకు పదునుగా పెడుతుండగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీని వెనుకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు భారీ సంఖ్యలో ముస్లింలు మద్దతు తెలిపారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) చేపట్టిన సంతకాల కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎంఆర్ఎం పిటిషన్ పై 10 లక్షల మందిపైగా ముస్లింలు సంతకాలు చేశారు. వీరిలో అత్యధికులు మహిళలు కావడం గమనార్హం.
ట్రిపుల్ తలాక్ అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలని ఎంఆర్ఎం పిలుపునిచ్చింది. ‘ఇది ఒక కమ్యునిటీలో ఎదురైన సమస్య. దీనిపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుగొనాలి. ట్రిపుల్ తలాక్ అంశంతో సంబంధమున్నవారు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వం కలిసి దీనిపై చర్చించాలి. ముస్లిం మహిళలకు అన్యాయం జరగకుండా చూడాల’ని ఎంఆర్ఎం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయానికి ట్రిపుల్ తలాక్ అంశం దోహదం చేసిందన్న వాదనలు విన్పిస్తున్నాయి.