విపరీత దూషణలతో త్రిష తీవ్ర నిర్ణయం!
మూగ ప్రాణుల సంరక్షణ కోసం జంతు హక్కుల కార్యకర్తగా త్రిష చాలాకాలంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పెటా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆమె సేవలు అందిస్తున్నది. అయితే, జల్లికట్టుపై నిషేధం అంశం త్రిషకు అనుకోని చిక్కులు తెచ్చిపెడుతున్నది. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు నిషేధం వెనుక పెటా కృషి ఉంది. దీంతో గత వారంరోజులుగా త్రిష చాలామంది జల్లికట్టు మద్దతుదారులకు లక్ష్యంగా మారింది.
ఆమె నటిస్తున్న ’గర్జన్’ సినిమా షూటింగ్‌పై ఆందోళనకారులు విరుచుకుపడి.. త్రిషపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సిబ్బంది వ్యానులో ఆమె తలదాచుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో త్రిష లక్ష్యంగా దారుణమైన ప్రచారానికి జల్లికట్టు మద్దతుదారులు తెరలేపారు. ఆమెను తిడుతూ, అసభ్యంగా దూషిస్తూ, అవమానిస్తూ.. కించపరిస్తూ జుగుప్సకరమైన పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పెటాను సమర్థిస్తూ.. ఎంత ప్రాచీనమైన క్రీడ అయిన జంతువులను హింసించే జల్లికట్టునే నిషేధించాల్సిందేనంటూ త్రిష్ ట్వీట్ చేసినట్టు ఆమె అధికారిక ఖాతాలో కనిపించింది. దీంతో అందరూ షాక్ తిన్నారు.
అయితే, తనకు వ్యతిరేకంగా దారుణమైన ప్రచారానికి తెరలేపిన వారే ఇలా తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి.. ఈ ట్వీట్ చేశారని త్రిష వివరణ ఇచ్చింది. ఆ వెంటనే ఆమె తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేస్తూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. జల్లికట్టు విషయంలో తాను ఏ తప్పు చేయకున్నా.. తీవ్రంగా అవమానాలపాలు, కష్టాలపాలు అయ్యానని ఆమె తెలిపింది. తాను తమిళ బిడ్డను అయినందుకు గర్వపడుతున్నానని, తన ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జల్లికట్టుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, జల్లికట్టును వ్యతిరేకించలేదని, అయినా తనను తీవ్రంగా అవమానాలపాలు చేస్తూ.. అసభ్యంగా దూషించారని త్రిష ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఆన్‌లైన్‌లో ఈ దూషణల పర్వం, అకౌంట్ హ్యాకింగ్ నేపథ్యంలో త్రిష తన తల్లితో కలిసి సోమవారం చెన్నైపోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన బిడ్డకు రక్షణ కల్పించాలని త్రిష తల్లి కోరింది.