మీరే ఉంచుకోండి: చైనాపై ట్రంప్ ఫైర్!
వాసింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. అమెరికా నేవీకి చెందిన డ్రోన్‌ను చైనా దొంగలించిందని, దానిని చైనా ఉంచేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న అమెరికా నేవీ ఓషనోగ్రాఫీ (సముద్ర అధ్యయన) డ్రోన్‌ను చైనా యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నానని, ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చైనా చెప్తుండగా.. ఆ దేశం తీరుపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘మీరు దొంగలించిన డ్రోన్ మాకు ఏమీ వద్దని మేం చైనాకు చెప్పదలుచుకున్నాం. దానిని మీరే ఉంచుకోండి’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అపారమైన వనరులున్న దక్షిణ చైనా సముద్రం మొత్తం గంపగుత్తగా తనదేనని, ఇందులో ఇతర దేశాలకు ఏమాత్రం హక్కులేదని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్‌ను చైనా చెప్పాపెట్టకుండా స్వాధీనం చేసుకుంది. తమ డ్రోన్‌ను ఇలా స్వాధీనం చేసుకోవడం అక్రమమని అమెరికా వాపోతున్నది. ట్రంప్ గతంలోనూ చైనా తీరుపై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.