
ఏంజెలాతో భేటీలో ట్రంప్ కంపు ప్రవర్తన!
- కరచాలనం చేయాల్సిందిగా కోరిన మెర్కెల్
- అయినా నిరాకరించిన ట్రంప్..
- ఆమె వైపు కన్నెత్తి కూడా చూడని అధ్యక్షుడు
న్యూయార్క్: అంతర్జాతీయ నాయకులతో కరచాలనానికి ఎప్పుడూ ముందుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో మాత్రం ఒకింత వికృతంగా వ్యవహరించారు. విలేకరుల సమావేశంలో ఆనవాయితీ ప్రకారం ఏంజెలా-ట్రంప్ కరచాలనం చేయాల్సిందిగా విలేకరులు కోరారు. దీంతో ఉత్సాహంతో 'మీరు నాతో కరచాలన చేస్తారా' అని మెర్కెల్ ట్రంప్‌ను అడిగారు. ట్రంప్ ఆ మాట వినిపించుకోనట్టే వ్యవహరించారు. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ట్రంప్ తీరుతో బిత్తరపోయిన ఆమె ఏం చేయాలో తెలియక ఒకింత తికమకపడ్డారు. ట్రంప్ ఇచ్చిన ఈ షాక్‌తో ఆమె ఇబ్బందికి లోనైనట్టు ఆమె హవాభావాల్లో స్పష్టంగా కనిపించింది.
అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా ట్రంప్‌తో ఏంజెలా భేటీ అయ్యారు. ఓవల్ కార్యాలయంలో వారి భేటీ అనంతరం విలేకరులతో ఫొటో పోజ్ సందర్భంగా ఈ వికృత ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ గతంలో అమెరికా పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోలతో భేటీ అయిన సందర్భంగా వారితో కరచాలనం చేశారు. అయితే, ప్రవాసులు, శరణార్థుల విషయంలో విభేదాల కారణంగానే ఏంజెలాతో ట్రంప్ అయిష్టంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె గురించి ఒక్క ప్రశంస కూడా చేయకపోగా.. ప్రవాసులు విషయంలో ఆమెకు ట్రంప్ క్లాస్ ఇచ్చినట్టు సమాచారం.