ఉనికి కోసం టీటీడీపీ పాట్లు!
- 'ఓటుకు కోట్లు'పై నష్ట నియంత్రణ చర్యల్లో నేతల పిల్లిమొగ్గలు
- జిల్లాల పర్యటనలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం
- పర్యటనలకు దూరంగా కొందరు నేతలు
సాక్షి, హైదరాబాద్: వలసలతో చిక్కి శల్యమైన తెలంగాణ టీడీపీ ఉనికి కోసం నానా తంటాలు పడుతోంది. 'ఓటుకు కోట్లు' కేసుతో పార్టీ పరువు బజారున పడటం, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికార టీఆర్‌ఎస్‌లోకి వరుస కట్టడంతో క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినడం వంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు టీటీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆయా సమస్యలపై జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించడం లేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడంలేదని వరంగల్‌లో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఒక రోజు దీక్ష చేశారు. తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో సైతం పర్యటించారు. తోట పల్లి రిజర్వాయరు నిర్మాణం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ముగ్గురు నాయకులే యాత్ర చేసి వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ‘ పాలమూరు - రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం చెబుతూ ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖపై టీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల గురించి టీడీపీ ఊదరగొట్టింది. అయినా పాలమూరు జిల్లా ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిందని భావించిన టీటీడీపీ నాయకులు గురువారం ఆ జిల్లాలో కూడా పర్యటించారు. ఒక వైపు ప్రభుత్వ తీరును విమర్శిస్తూనే, తాము చేపట్టిన ప్రాజెక్టులు, వెచ్చిం చిన నిధుల వివరాలను వల్లెవేయడం మొదలు పెట్టారు. అయితే ఇంతా చేస్తున్నా, తెలంగాణ నాయకత్వానికి సొంత పార్టీలోని సీనియర్ల నుంచే ఆదరణ కరువైంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నేత మోత్కుపల్లి నర్సింహులు , ఇతర నేతలు వీరి పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో తెలంగాణకు కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ నేతలు వేస్తున్న పిల్లిమొగ్గలు ఆసక్తి కలిగిస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు.