'కత్తి' వివాదం... థియేటర్ల విధ్వంసం
చెన్నై: విజయ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించి తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'కత్తి' చిత్రంపై నెలకొన్న వివాదం రోజురోజూకు రాజుకోంటుంది. కత్తి చిత్రాన్ని బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేసి తీరుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. దాంతో తమిళ సంఘాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత అర్థరాత్రి చెన్నై మహానగరంలోని పలు సినిమా థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వారు. ఆ దాడిలో రెండు థియేటర్లు ధ్వంసమైనాయి. దీంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియెటర్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినిమా థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్సపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు కత్తి నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. అందుకు వారు ససేమిరా అంటున్నారు. దీంతో ఆగ్రహించిన తమిళ సంఘాలు గత రాత్రి విధ్వంసానికి దిగాయి.