‘మక్కా’ మృతుల్లో ఇద్దరు భారతీయులు
107కు చేరిన మృతులు..
క్షతగాత్రుల్లో ఐదుగురు హైదారాబాద్ వాసులు సహా 19 మంది భారతీయులు
మక్కా: సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్రస్థలం మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 107కు, క్షతగాత్రుల సంఖ్య 238కి చేరింది. మృతుల్లో ఇద్దరు భారత మహిళలు, క్షతగాత్రుల్లో ఐదుగురు హైదరాబాదీలు సహా 19 మందిభారతీయులు ఉన్నారు. చనిపోయిన భారత మహిళలను కేరళకు చెందిన మామీనా ఇస్మాయిల్, పశ్చిమబెంగాల్‌కు చెందిన మోనిజా అహ్మద్‌గా గుర్తించినట్లు జెడ్డాలోని భారత కాన్సులేట్ తెలిపింది.
క్షతగాత్రుల్లో హైదరాబాద్ వాసులతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారని, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, పంజాబ్, బిహార్, అస్సాంల నుంచి ఒకరు చొప్పున ఉన్నారని వెల్లడించింది. దుర్ఘటనలో తమ రాష్ట్రంలోని అసాన్సోల్‌కు చెందిన మునిజా చనిపోయినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఫేస్‌బుక్‌లో తెలిపారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారని, హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారని భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఢిల్లీలో చెప్పారు. గాయపడిన భారతీయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి మాక్కా ఆస్పత్రుల వద్ద పలువురు బారులు తీరారు.
పెనుగాలులు, వర్షాలతో కూలిన క్రేన్
మక్కా మసీదు ప్రాంగణ విస్తరణకోసం వాడుతున్న భారీ క్రేన్ పెనుగాలులు, భారీ వర్షం కారణంగా కుప్పకూలిందని స్థానిక అధికారులు తెలిపారు. క్రేన్ అల్ తవాఫ్ మార్గంలో కాకుండా వేరే చోట పడి ఉంటే మృతుల సంఖ్య భారీగా పెరిగేదని మసీదులో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. మక్కా ప్రాంత గవర్నర్ ప్రిన్స్ ఖలీద్ అల్ ఫైజల్ ఆదేశంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అధికారుల నిర్ల్యక్షమే ఈ దుర్ఘటనలకు కారణమని మక్కాలోని ఇస్లామిక్ హెరిటేజ్ రీసెర్చ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు ఇర్ఫాన్ అల్ అలావీ ఆరోపించారు. ప్రణబ్, అన్సారీ, మోదీ సంతాపం.. : ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వైఎస్ జగన్ సానుభూతి
సాక్షి, హైదరాబాద్: ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ట్విటర్ ద్వారా ఆకాక్షించారు.
హైదరాబాదీ క్షతగాత్రులు..: ఈ ప్రమాదంలో తమ కమిటీ ద్వారా వెళ్లిన ముగ్గురు హైదరాబాదీ లు గాయపడినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎం. షుకూర్ తెలిపారు. పాతబస్తీ భవానీ నగర్‌కు చెందిన షేక్ ముజీబ్(38) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని, రెడ్‌హిల్స్‌కు చెందిన మహ్మద్ హమీద్, అనీస్ ఖాతూన్‌లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మహమ్మద్ యానస్, సఫర్‌బీ అనే హైదరాబాద్ వాసులు గాయపడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.