భారతీయ భాషల్లోని విజ్ఞానంతోపాటు వాటికి సంబంధించిన సకల సమాచారాన్ని మల్టీమీడియా(టెక్స్ట్, ఆడియో, వీడియో, ఫొటోలు) ద్వారా...
న్యూఢిల్లీ: భారతీయ భాషల్లోని విజ్ఞానంతోపాటు వాటికి సంబంధించిన సకల సమాచారాన్ని మల్టీమీడియా(టెక్స్ట్, ఆడియో, వీడియో, ఫొటోలు) ద్వారా ఇంటర్నెట్ ప్రపంచం ముందుంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌వాణి ప్రాజెక్టు పేరిట ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భాషా వెబ్‌సైట్ ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కసరత్తు చేస్తోంది. వివిధ భాషలకు సంబంధించి కంప్యూటరీకరించిన/కంప్యూటరీకరించని సమాచారాన్ని పంచుకోవాల్సిందిగా అన్ని వర్సిటీలు, కాలేజీలను యూజీసీ కార్యదర్శి జస్పాల్‌సింగ్ సంధూ కోరారు.
దేశ భాషా వైవిధ్యాన్ని సైబర్‌స్పేస్‌లో చాటేందుకు, ఈ-కంటెంట్‌ను అభివృద్ధి చేసేందుకు, వివిధ భాషల్లోని దేశీయ సంప్రదాయ సాహిత్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోందని సంధూ పేర్కొన్నారు. 2001 జనాభా గణాంకాల ప్రకారం దేశంలో 122 షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ భాషలతోపాటు మరో 234 మాతృ భాషలు ఉన్నాయన్నారు.