న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లోనే కలిపే ప్రతిపాదనకు నరేంద్ర మోదీ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ఫిబ్రవరి 1న ఒకే బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. దీంతో ప్రత్యేక రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంస్కృతితోపాటు, 92ఏళ్ల నుంచి యూనియన్ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆచారానికి ఎన్డీయే సర్కార్ తిలోదాకాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 25 , 2017నుంచి ప్రారంభించేందుకు యోచిస్తోందని తెలిపాయి.
అయితే విలీనం తర్వాత రైల్వే శాఖ ఎప్పటిలాగానే స్వతంత్రంగా వ్యవహరించేలా ఫంక్షనల్ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇకమీదట రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో డివిడెండ్ చెల్లింపు, తదితర అంశాలను సమీక్షించే రైల్వే కన్వెన్షన్ కమిటీ రద్దవుతుంది. ఇతర విభాగాలకు మాదిరిగానే, మూలధన వ్యయం కోసం రైల్వేలకు బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది. వివిధ వర్గాలకు అందించే అన్ని వాస్తవ రైల్వే పాస్ లు ఆధార్ నంబరుకు అనుసంధానం చేయబడతాయి.
ఏప్రిల్ నెలకల్లా ద్రవ్యబిల్లు, డిమాండ్లు-గ్రాంట్లపై పార్లమెంటులో చర్చలను పూర్తిచేయాలని, మే నెల నుంచే రాష్ర్టాలకు నిధులను విడుదల చేయాలని భావిస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చించి ఆమోదం పొందినట్టు సమాచారం.