న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చింది. అందుకు ఎప్పుడూ చెబుతున్న కారణాన్నే తిరిగి వల్లె వేసింది. 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వజాలమని స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీపై గడిచిన రెండున్నరేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతుండగా, తాజాగా బుధవారం న్యూఢిల్లీలో బీజేపీ, టీడీపీ నేతలు హైడ్రామా నడిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబోతున్నారంటూ ఉదయం నుంచి రాత్రి వరకు నానా హడావిడి చేశారు. టీడీపీ మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంతనాలు జరపడం, మధ్య మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ.... ఏ క్షణంలోనైనా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉందన్న రీతిలో హైడ్రామా నడిపించారు.
చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దానికి ప్రతిగా ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఆ ప్యాకేజీలో ఏముందన్న విషయాన్ని కూడా మంత్రి వివరించకుండా గురువారం ఉదయం అందుకు సంబంధించి ఒక నోట్ విడుదల చేస్తామన్నారు. అయితే అందులో ప్రకటించిన అంశాలు కూడా ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంటుందని మెలిక పెట్టారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒకవైపు చెబుతూనే రైల్వే జోన్, నియోజకవర్గాల పునర్విభజన, వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ - చైన్నై కారిడార్ వంటి కీలకమైన హామీలపై ఆయా మంత్రిత్వ శాఖలు నిర్ణయం తీసుకుంటాయని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి 3979.5 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చామని, మరో 2500 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి అందించామని, అలాగే వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1050 కోట్లు అందజేశామని మంత్రి తెలిపారు. వీటితో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని చెప్పారు. 14 వ ఆర్థిక సంఘం చేసిన కొన్ని సిఫారసుల మేరకు ఆర్థిక లోటును పూడ్చడానికి సంబంధించి ఇప్పటికే రెండేళ్ల నిధులను మంజూరు చేశామని, 2015-2020 ఐదేళ్ల కాలంలో ఆ లోటు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును 1-4-2014 తేదీ నుంచి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, అప్పటి నుంచి ఆ ప్రాజెక్టుకయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎంతకేటాయించిందన్న వివరాలను వెల్లడించలేదు. పైగా ఆ ప్రాజెక్టు కోసం నాబార్డు నుంచో లేదా మరో రూపంలోనో రుణం రూపేణా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పినందున దాన్ని రాష్ట్రానికే అప్పగించినట్టు తెలిపారు.
రాష్ట్ర విభజన చేసిన సందర్భంలో అయిదు అంశాలను చట్టంలో చేర్చారని, వాటన్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని చెబుతూ ఆరవ అంశమైన ప్రత్యేక హోదా కల్పించే విషయం చట్టంలో చేర్చలేదని మంత్రి వివరిస్తూ, దానికి తోడు 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు.
రైల్వే జోన్ ఎక్కడ
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుతాయా అంటే కూడా కేంద్ర మంత్రులు స్పష్టత నివ్వలేకపోయారు. ప్రతి అంశంలోనూ ఫీజిబిలిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చట్టంలో చెప్పినందున వాటిని పరిశీలిస్తున్నామని దాటవేశారు. రైల్వే జోన్ ను విశాఖలో కాకుండా విజయవాడను ప్రకటించనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లాల్లో పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి. అదే విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా, ఆ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి చూసుకుంటారని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
నోట్ లో ఏముంటాయి
ఇకపోతే, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీగా కేంద్రం ప్రకటించబోయే వరాల్లో కొత్తగా ఏముంటాయన్న చర్చ మొదలైంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఇక గురువారం విడుదల చేయబోయే నోట్ లో కొత్తగా ఏముంటాయి... పైగా ఆ నోట్ లో పేర్కొన్న అన్ని విషయాలను ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది కూడా. పైపెచ్చు వీటన్నింటినీ వచ్చే అయిదేళ్ల కాలంలో మాత్రమే చేపడుతారట. గతంలో బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రానికి ప్రకటించినట్టుగానే విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ గంపగుత్తగా ఒకచోట చేర్చి ప్యాకేజీగా ప్రకటించబోతున్నారని మాత్రం అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు
Published Wed, Sep 7 2016 11:35 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement