విచారణ పూర్తయితేనే.. లోతు తెలిసేది: జైట్లీ
ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా నల్లధనం బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, ఎస్‌ఎఫ్‌ఐఓలు జరుపుతున్న విచారణ పూర్తయిన తర్వాతే... ఈ కేసు తీవ్రత ఎంతన్నది తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రి తెలిపారు. బీవోబీకి చెందిన కొందరు అధికారులు 59 మంది ఖాతాదారులతో కుమ్మక్కై విదేశాలకు (ముఖ్యంగా హాంకాంగ్‌కు) సుమారు రూ. 6,000 కోట్ల పైచిలుకు రెమిటెన్సులు అక్రమంగా పంపారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. నకిలీ కంపెనీలు ఏర్పాటు చేయ డం, ఎగుమతుల విలువను ఎక్కువ చేసి చూపించి ఆ తర్వాత సుంకాలపరమైన ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడం వంటి ఆరోపణలతో పలువురు అరెస్టయ్యారు.
నిజాలు నిగ్గుతేలే దాకా బీవోబీపై విచారణ: రాజన్
నిందితులకు శిక్షపడే దాకా, నిజాలు నిగ్గుతేలే దాకా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెమిటెన్సుల కేసులో విచారణ కొనసాగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. వేగంగా స్పందించకపోతే ఇలాంటి మోసాలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు, బీవోబీ కేసులో రెమిటెన్సుల మొత్తం.. ముందుగా భావించినట్లు రూ. 6,000 కోట్లు కాకుండా రూ. 3,500 కోట్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా పేర్కొన్నారు.