
రేపు నామినేషన్ వేయనున్న ముఖ్యమంత్రి
- యూపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు
- బరిలో యోగి సహా పలువురు మంత్రులు
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు డిప్యూటీ సీఎంలు మంగళవారం శాసనమండలి సభ్యత్వం కోసం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం, గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.. యూపీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే.
ప్రమాణం చేసేనాటికి యోగితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఇద్దరు మంత్రులు రాష్ట్ర చట్టసభలో సభ్యులు కారు. వీరంతా ఆరు నెలల లోపు.. అంటే ఈనెల 19వ తేదీ కల్లా శాసనసభ్యులు కాకుంటే చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత కోల్పోతారు. దీంతో వారికి అవకాశం కల్పించడం కోసం నలుగురు బీజేపీ ఎమ్మెల్సీలు(బుక్కల్ నవాబ్, యశ్వంత్, సరోజిని అగర్వాల్, అశోక్ బాజ్‌పాయ్) రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈనెల 5వ తేదీలోగా నామినేషన్ పత్రాల దాఖలు, ఆరో తేదీన పరిశీలన, ఉప సంహరణకు ఈనెల 8వరకు గడువు ఇచ్చిన ఈసీ 15న పోలింగ్ నిర్వహించనుంది. అదేరోజు లెక్కింపు కూడా పూర్తవుతుంది. రేపు నామినేషన్ దాఖలు చేయనున్నవారిలో సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్‌ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, మోహ్‌సిన్ రజాలు ఉన్నారు.