మాండ్యలో శాండిల్ వార్
*అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం
* పోటీలో రక్షిత, రమ్య, ఉపేంద్ర
బెంగళూరు : మండ్య పార్లమెంటు నియోజకవర్గంలో ‘స్టార్’వార్ జరగనుంది. ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగడానికి శాండిల్‌వుడ్ నటులు ఉవ్విళ్లూరుతుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఇటీవల మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రమ్య విజయం సాధించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తనే ఎన్నికల బరిలో దిగాలని రమ్య భావిస్తున్నారు.
సమయం దొరికినప్పుడల్లా బహిరంగంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ ఈమెకు స్వయాన బంధువు. అంతేకాకుండా రమ్యకు అటు అధిష్టాన ంతో పాటు ఇటు రాష్ట్ర నాయకులైన అంబరీష్‌తో సహా పలువురు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘యువ మంత్ర’ పఠిస్తుండటంతో మూడు పదులు కూడా దాటని రమ్యకు కలసివచ్చే అవకాశం.
దీంతో రాబోయే మండ్యలో సార్వత్రిక ఎన్నికల్లో మండ్య పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె బరిలో దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక జేడీఎస్ తరఫున టికెట్టును శాండిల్‌వుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా పేరు సంపాదించుకున్న రక్షిత ప్రేమ్ ఆశిస్తున్నారు. జేడీఎస్ తరఫున తప్ప మరో పార్టీ టికెట్‌పై పోటీ చేసేది లేదని, అంతేకాకుండా మండ్యలో తప్ప మరెక్కడా పోటీకి దిగనని నటి రక్షిత బహిరంగంగానే చెబుతూ ఉన్నారు.
రమ్య స్టార్‌డమ్‌ను అడ్డుకోవడానికి మరోస్టార్‌ను ఎన్నికల బరిలో దించాలనే ఫార్ములాను జేడీఎస్ నాయకులు అనుసరించాలనుకుంటే రక్షితకే పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉంది. శాండిల్‌వుడ్ రియల్‌స్టార్ ఉపేంద్ర కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈయన విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఏబీవీపీలో కీలక నాయకుడు. తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా ‘ఉప్పి’ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి.
ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీ కూడా మండ్య పార్లమెంటును ఎగురేసుకుపోవడానికి ‘స్టార్’ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు స్టార్‌లనే ఎన్నికల బరిలోకి దించితే వీరికి చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్రకు మండ్య పార్లమెంటు టికెట్టు కేటాయించే అవకాశం కన్పిస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మండ్యపై దృష్టి పెట్టాయి.