
నీలి చిత్రాలకు రెడ్‌లైట్ ఎందుకు!
దేశవ్యాప్తంగా చెప్పాపెట్టకుండా ఇంటర్నెట్‌లో నీలి (పోర్న్) చిత్రాలను నిషేధించడం పట్ల నెటిజన్లు పటాకుల్లా జోకులు పేలుస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చెప్పాపెట్టకుండా ఇంటర్నెట్‌లో నీలి (పోర్న్) చిత్రాలను నిషేధించడం పట్ల నెటిజన్లు పటాకుల్లా జోకులు పేలుస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్షంలో రాహుల్ గాంధీలు బ్రహ్మచారులుగా ఉన్న దేశంలో ఎలా నీలి చిత్రాలను నిషేధిస్తారని వారంతా ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు బోర్‌గా సాగుతున్నప్పుడు నీలి దృశ్యాలతో టైపాస్ చేసే ఎంపీలు ఇప్పుడు ఎలా టైంపాస్ చేస్తారన్నది ఓ నెటిజన్ ప్రశ్న (ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలే సవ్యంగా జరగడం లేదనుకోండి. ఎంపీలు పోర్న్ సైట్లు చూస్తూ కెమెరా కంటికి దొరికిన సందర్భాలు తెల్సిందే)
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి రోడ్లపై ట్రాఫిక్ నిషేధిస్తారా ? అంటూ టాలీ, బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పటికే తనదైన శైలిలో స్పందించిన విషయం తెల్సిందే. అదే కోవలో మెజారిటీ నెటిజన్లు నిషేధానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన లాప్‌టాప్‌లను ఏం చేసుకోవాలో తెలియక అక్కడి యువత వాటిని నెత్తికేసి కొట్టుకుంటున్నారట. భారత దేశంలో నిజంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన ఘనత పోర్న్ సైట్లదేనని కొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు.
మోదీ ప్రభుత్వానికి ఏం వచ్చింది..పోయేకాలం! మొన్న కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ బ్యాన్, మరికొన్ని రాష్ట్రాల్లో దారూ బ్యాన్, గుట్కా బ్యాన్, మ్యాగీ బ్యాన్, ఇప్పుడు పోర్న్ బ్యాన్....అన్నది మరో నెటిజన్ కామెంట్. ఇదంతా కరసేవకులను ప్రోత్సహించేందుకేనా? అన్నది ఇంకొకరి ప్రశ్న. ఇక మమ్మల్ని ఎవరూ చూడరు, మా గురించి చదవరా అంటూ అజంతా శిల్పాలు కన్నీరుగారుస్తున్నాయట!
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవితకాలంపాటు పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధించమని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేస్తే రాహుల్ గాంధీకి తిరుగులేని మెజారిటీ ఖాయమని, మొత్తం ఆయన కాంగ్రెస్ దండు విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్ల సలహా. ఈ నిషేధం ఇలాగే కొనసాగితే ఒక్క తెలుగు సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉండదని నెటిజన్లు వాదిస్తున్నారు.