ఈయూపై అమెరికా సీరియస్
పన్ను ఎగవేతల నేపథ్యంలో అమెరికా కంపెనీలపై యూరోపియన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తమ కంపెనీలపై ఈయూ తీసుకుంటున్న చర్యలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ మండిపడుతోంది. అమెరికా కంపెనీలకు భారీగా నష్టపరిహారాలను వేయడానికి ఈయూ ప్లాన్ చేస్తుందని వెల్లడిస్తోంది. అయితే ఎలాంటి పక్షపాతం లేకుండానే ఈ చర్యలు చేపడుతున్నట్టు యూరోపియన్ కమిషన్ చెబుతోంది. యూరోప్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసిన అమెరికా కంపెనీలకు జారీచేసిన టాక్స్ డీల్స్పై ఈయూ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. యాపిల్తోపాటు, అమెజాన్, స్టార్బక్స్ వంటి కంపెనీలను యూరోపియన్ కమిషన్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణల్లో టెక్ దిగ్గజం యాపిల్ మల్టీ బిలియన్ పౌండ్ బిల్లును పెనాల్టీగా ఎదుర్కోబోతుంది. వచ్చే నెలలో యాపిల్పై తమ నిర్ణయాన్ని ప్రకటించాలని ఈయూ భావిస్తోంది.
ఐర్లాండ్లో యాపిల్ తన కార్యాలయ స్థాపించుకోవడానికి ప్రత్యేక పన్ను ప్రయోజనాలను ఉన్నాయో లేదో ప్రస్తుతం విచారిస్తున్నామని, ఇతర కంపెనీలకు మాత్రం ఇలాంటి అవకాశమే లేదని ఈయూ ఎగ్జిక్యూటివ్ బాడీ పేర్కొంటోంది. ఇతర కంపెనీలు పన్ను ఎగొట్టి ఈయూ దేశాల నిబంధనలను అతిక్రమిస్తున్నాయని కమిషన్ సీరియస్ అవుతోంది. యాపిల్ కంపెనీతో ఐర్లాండ్కు ఎలాంటి స్పెషల్ టాక్స్ రేట్ డీల్ లేదని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. ఈయూ చట్టాలను యూరప్లో ఆపరేట్ చేసే అన్ని కంపెనీలకు సమానంగా వర్తించేలా చేస్తున్నామని కమిషన్ పేర్కొంది. అయితే అమెరికా కంపెనీలకు భారీగా నష్టపరిహారాలను జారీచేయడానికి బ్రూస్లీ(యూరోపియన్ యూనియన్ తాత్కాలిక రాజధాని) కావాలనే భిన్నమైన ప్రమాణాలను ఎంచుకుంటుందని అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ఈయూ చర్యలపై డిపార్ట్మెంట్ విమర్శలు గుప్పిస్తోంది.