భారత్ ప్రతిపాదనకు అమెరికా ఓకే
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ప్రతిపాదనకు అగ్రదేశాలు దన్నుగా నిలిచాయి. పఠాన్ కోట్ సైనిక స్థావరంపై దాడి సూత్రధారి, పాకిస్తాన్ కు చెందిన జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పై నిషేధం విధించాలన్న భారత్ ప్రతిపాదనకు అమెరికా, యూకే, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. ఎప్పటిలానే చైనా అడ్డుపడింది. వాషింగ్టన్-ఢిల్లీ మధ్య జరిగిన సంప్రదింపులతో ఈ ప్రతిపాదన తుదిరూపం దాల్చింది. జైషే-ఈ-మహ్మద్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని, దీనికి సంబంధించిన నాయకులు స్వేచ్ఛగా తిరగకుండా ఆంక్షలు విధించాలని ప్రతిపాదనలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను అమెరికా సమర్థించడంతో చైనా వ్యతిరేకించిందని తెలిపాయి.
ఏ ప్రతిపాదనైనా భద్రతా మండలిలో 10 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి.. లేకుంటే నిలిపివుంచాల్సి ఉంటుంది. ఆరు నెలల పాటు ‘హోల్డ్’లో పెట్టిన తర్వాత మరో మూడు నెలలు పొడిగించుకునే అవకాశముంది. అప్పటికీ ఆమోదం లభించకపోతే ప్రతిపాదన కాలపరిమితి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రతిపాదనకు చైనా బ్రేక్ వేసింది. భద్రతా మండలిలో తాజా పరిణామాలను చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని భారత విదేశాంగ ప్రకటించింది. సాంకేతిక అంశాలను సాకుగా చూపి చైనా ఇప్పటికే రెండుసార్లు భారత్ ప్రతిపాదనకు అడ్డుతగిలింది.