ఓటుకు నోటు కేసు: ఉత్తరాఖండ్ సీఎంకు సమన్లు
ఉత్తరాఖండ్-లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (ఓటుకు నోటు) రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. గత ఏడాది దుమారం రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై విచారణలో భాగంగా సీబీఐ ఈ చర్య తీసుకుంది. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో సీఎంకు వ్యతిరేకంగా బయటపడిన స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 26 (సోమవారం)న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడంతోపాటు బీజేపీ లోని కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు వ్యతిరేకంగా దుమారం చెలరేగింది. 23మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వారితో మాట్లాడుతుండగా రికార్డయిన ఆడియో టేపు, వీడియో (సీడీ) వివాదాన్ని రాజేసింది. సీఎం హరీష్ రావత్ డబ్బులిస్తానని తమను మభ్యపెట్టేందుకు యత్నించారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించడం సంచలనానికి దారి తీసింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.