నాడు ప్లంబర్.. నేడు కేంద్ర మంత్రి!
ప్రధాని నరేంద్ర మోదీ తాను నడిచొచ్చిన దారి మర్చిపోలేదు. టీ అమ్ముకుని దేశాన్ని ఏలేస్థాయికి చేరిన మోదీ... తనలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఆయనే విజయ్ సంప్లా. ఒకప్పుడు ప్లంబర్ పనిచేసిన సంప్లా అంచెలంచెలు ఎదిగి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మొదటిసారి ఎంపీగా గెలిచిన ఆయనకు కేబినెట్ పదవి దక్కడం విశేషం.
దళిత వర్గానికి చెందిన 2014 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లోని హిషియాపూర్(రిజర్వుడ్) స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. మెట్రికులేషన్ చదివిన విజయ్ సంప్లా- పంజాబ్ లో సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ముందు గల్ఫ్ లో ప్లంబర్ గా పనిచేశారు. 59 ఏళ్ల విజయ్ సంప్లా- సొంత గ్రామానికి సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత పలు కీలక పదవులు చేపట్టారు.
పంజాబ్ రాష్ట్ర అడవుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా, పంజాబ్ రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా పనిచేశారు. బీజేపీ పంజాబ్ రాష్ట్ర శాఖలోనూ పలు పదవులు నిర్వహించారు. ఎంపీగా గెలిచేంత వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ సంప్లాకు కేంద్ర పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.