వోడాఫోన్ పోటా పోటీ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో దేశీయ ఆపరేట్లర్లు తమ ఖాతాదారులను నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. దాదాపు అన్ని టెలికాం సేవల సంస్థలు వరుస ఆఫర్లతో వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆపరేటర్ వోడాఫోన్ తన ఖాతాదారులు రిలయన్స్ జియోకు తరలిపోకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కొత్త టారిఫ్ లను శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రకటించిన టారిఫ్ పథకాలను ధీటుగా సరికొత్త ప్లాన్ ప్రకటించింది.
నెలకు రూ.346 రీచార్జ్‌పై 28జీబీ 4 జీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్‌ఎమ్మెస్ లు లాంటి ప్రయోజనాను అందించనుంది. ఈ ఆఫర్ మార్చి 15 వరకూ మాత్రమే చెల్లుబాటవుతుందని వోడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం వినియోగదారులు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కానీ వోడాఫోన్ కస్టమర్లు ఇలాంటి ఫీజు లేకుండానే ఆ మంత్లీ ప్లాన్ ని ఎంజాయ్ చేయొచ్చన్నమాట.
మరోవైపు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రాంలో ప్రకటించిన డ్యాటా ప్రయోజనాలకు అదనపు డ్యాటాను ఆఫర్ చేస్తూ జియో శుక్రవారం బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం రూ.303లతో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటాను కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు10 జీబీ డేటాను అదనంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.