సీఎం, గవర్నర్ మాటల యుద్ధం
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్ బేడీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ పరస్పరం విమర్శస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. కిరణ్‌బేడీ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీఎం.. అధికారులకు ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవొద్దని, తప్పనిసరైతే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అనవసరంగా కిరణ్‌బేడీ జోక్యం చేసుకుంటున్నారని గతవారం నారాయణస్వామి విమర్శించారు. మంత్రులను, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మానుకోవాలని, అగౌరపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని అసెంబ్లీ వేదికగా ఆమెకు సూచించారు.
నారాయణస్వామి వైఖరిని కిరణ్‌బేడీ తప్పుబట్టారు. ‘మీరు కోరుకుంటున్నది రబ్బర్ స్టాంపునా లేదా బాధ్యతాయుతమైన పాలకురాలినా’ అని నారాయణస్వామిని అని ప్రశ్నించారు. పుదుచ్చేరికి న్యాయం, నైతిక నిష్ఠ, మంచి పాలన కావాలని పేర్కొన్నారు. కాగా, కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.