
ఎంపైర్ కునుకు.. మ్యాచ్‌లో పెద్ద పొరపాటు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తరచూగా ఎంపైరింగ్ పొరపాట్లు, తప్పిదాలు దర్శనమిస్తున్నాయి. కానీ, తాజాగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంపైర్లు కునుకుపాట్లు పడుతూ.. పెద్ద తప్పిదానికే కారణమయ్యారు.
మ్యాచ్ ఆరో ఓవర్‌లో ఎంపైర్లు కునుకుతీస్తూ నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో సన్‌రైజర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆరో ఓవర్ చివరి బంతిని ఎదుర్కోవడమే కాకుండా.. ఏడో ఓవర్ మొదటి బంతిని సైతం ఆడాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఓవర్ ముగిస్తే స్ట్రైకింగ్ మారాల్సి ఉంటుంది. కానీ ఎంపైర్ల అలసత్వం వల్ల ఈ తప్పిదం జరిగింది.
శిఖర్ ధావన్‌తో కలిసి వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఆరో ఓవర్ వేశాడు. ఆరో ఓవర్ చివరి బంతిని వార్నర్ ఫోర్‌గా మలిచాడు. దీంతో నిబంధనల ప్రకారం నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న ధావన్ స్థానం మార్చుకొని ఏడో ఓవర్ తొలి బంతిని ఎదుర్కోవాలి. కానీ, ఎంపైర్లు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో వార్నరే ముంబై బౌలర్ మెక్లీనగన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని ఎదుర్కొని ఒక సింగిల్ కూడా తీశాడు. అయినా, ఎంపైర్లు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో మ్యాచ్ అలా సాగిపోయింది.
నిజానికి క్రికెట్ మ్యాచ్‌లలో ఎంపైర్లు తప్పిదాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. బౌలర్ వేసిన బంతులను తప్పుగా లెక్కబెట్టడం, ఒక్కోసారి బౌలర్‌తో అధిక బంతులు వేయించడం లాంటి పొరపాట్లు ఎంపైర్లు చేస్తుంటారు. కానీ ఓవర్ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం జరగాల్సిన లీగల్ క్రాసింగ్ ఓవర్‌ను పట్టించుకోకపోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. సరే! ఈ వ్యవహారంలో ఎంపైర్లు ఒకవేళ కునుకు తీశారే అనుకుందా.. కానీ వార్నర్, ఆయన బ్యాటింగ్ సహచరుడు ధావన్‌లు ఏం చేస్తున్నారు? వారు సైతం ఓవర్ ముగిసిన విషయాన్ని పట్టించుకోకుండా ఆటలో లీనమయ్యారా? లేక అలసత్వమా? అన్నది విస్మయం కలిగిస్తోంది.