నోయిడా: చైనా కు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మొబైల్ మార్కెట్ ను క్యాప్చర్ చేసే ఆలోచతో రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈమేరకు భారీటార్గెట్ తో రంగంలో దిగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి తయారీ యూనిట్ ను భారత్‌లో ఏర్పాటు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పేందుకు యోచిస్తోంది. దీని ద్వారా ఇండియాలో మొట్టమొదటి తయారీ యూనిట్ పెడుతున్న సంస్థగా తాము అవతరించనున్నామని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ వివేక్ జాంగ్ తెలిపారు. ఇప్పటికే గుర్‌గావ్‌లో రూ. 125 కోట్ల పెట్టుబడితో గత ఏడాది ప్రారంభించిన 30వేల చదరపు గజాల ప్లాంట్ లో ప్రస్తుతం తాము నెలకు 10 లక్షల యూనిట్లను ఎసెంబ్లింగ్ చేస్తున్నామని, దీన్ని మూడింతలు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. దాదాపు30 లక్షల టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు. తద్వారా స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయని వెల్లడించారు.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం మార్చి 31 తో ముగిసిన మొదటి త్రైమాసానికి వివో, షియామీ, అప్పో, లీ ఇకో , లాంటి చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్స్ భారతదేశం అమ్మకాల్లో 22 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. ఐడీసీ అంచనాల ప్రకారం మెట్రో నగరాల్లోనే మొబైల్ ఫోన్ విక్రయాలు బావున్నాయనీ, మోటరోలా, లెనోవో, షియామీ, లీ ఇకో ఫోన్లు ఇక్కువగా అమ్ముడవుతున్నాయని తెలిపారు.
ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని, పూర్తి స్థాయి తయారీ కేంద్రం ఏర్పాటు తమ కంపెనీకి ప్రాధాన్య అంశమని మీడియాతో చెప్పారు. సరసమైన ధరల్లో టెక్నాలజీని అందించడమే వివో లక్ష్యమన్నారు. ఈ విషయంలో మేకిన్ ఇన్ ఇండియా తమకు గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పునాది వేసిందన్నారు. భారత మార్కెట్లో వివో నిబద్ధతను చాటుకునేందుకు మేక్ ఇన్ ఇండియా ఒక ప్రధాన అడుగుగా పనిచేయనుందన్నారు. సుదీర్ఘ అనుభవం కంపెనీ సొంతమని ఈ నేపథ్యంలో భారత్‌లో విభిన్న, వినూత్న ఫీచర్లతో ఫోన్లను అందించనున్నట్టు వివేక్ జాంగ్ పేర్కొన్నారు.