
ప్రశ్నిస్తూనే ఉంటాం: సోనియా
న్యూఢిల్లీ: రైతాంగ సమస్యలను కాంగ్రెస్ లేవనెత్తుతూనే ఉంటుందని పార్టీ చీఫ్ సోనియాగాంధీ స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలతో సమావేశంలో ఆమె.. ఈ వారం పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై లోతుగా చర్చించారు. రైతులతో భేటీ, పార్టీ భేటీల కారణంగా లోక్‌సభలో రాహుల్ ప్రసంగాన్ని వినడం సాధ్యం కాలేదని, అయితే, బాగా ప్రసంగించారని తెలిసిందని అన్నారు. కాగా, వందలాది రైతులు సోమవారం సోనియాతో సమావేశమయ్యారు. అధికారిక నివాసంలో వారితో రైతు సమస్యలు, భూ బిల్లు తదితరాలపై బృందాలవారీగా సోనియా చర్చలు జరిపారు.
సుష్మా ఆరోగ్యంపై సోనియా వాకబు
కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆరోగ్యంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సోమవారం వాకబు చేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో లోక్‌సభ సభ వాయిదా పడ్డాక వారిద్దరూ స్వయంగా సుష్మ వద్దకు వెళ్లారు. బాగున్నారా..? ఆరోగ్యం ఎలా ఉందంటూ నవ్వుతూ పలకరించారు. సుష్మ కూడా చిరునవ్వుతో వారితో మాట్లాడారు. ఆదివారం పార్లమెంట్ హౌస్‌లో ఓ సదస్సుకు హాజరై వస్తుండగా.. మెట్లపై తడబడడంతో సుష్మ కాలు బెణికింది. కాలు నొప్పి ఉన్నా ఆమె యథావిధిగా అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. జకార్తాలో జరగనున్న బన్దుంగ్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆమె ఇండోనేసియా వెళ్లనున్నారు.