సవాళ్లను అధిగమిస్తాం: రాజన్
ముంబై: ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలమన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్‌గా నియమితులైన రఘురామ్ రాజన్ గురువారం వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇది సవాళ్లతో కూడిన సమయం. సవాళ్లను మనం అధిగమిస్తాం’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఒక గొప్ప సంస్థ. ఇటువంటి అత్యున్నత స్థాయి సంస్థలో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసే అవకాశం కోసం నిరీక్షిస్తున్నాను’’ అని రాజన్ అన్నారు.
మూడు వారాలు ఓఎస్‌డీగా...
ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన రాజన్, ఈ బాధ్యతలు స్వీకరించే ముందు సంబంధిత అత్యున్నతస్థాయి సంస్థలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా పనిచేయనున్నారు. మూడు వారాల పాటు ఆయన ఈ విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వచ్చేనెల 4న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, మరుసటి రోజు రాజన్ ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్‌బీఐ కార్యకలాపాలకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనానికి రాజన్‌కు ఓఎస్‌డీ బాధ్యతలు దోహదపడతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజన్, ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా మూడేళ్ల పాటు కొనసాగుతారు.