ఆ రోజు ఉద్యోగులకు సెలవులు బంద్
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు బంద్ నిర్వహించే సోమవారం రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఏ ఉద్యోగికీ సెలవు మంజూరు చేసేదిలేదని, తగిన కారణం లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర‍్యలు తప్పవని ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వాసుదేవ్ చెప్పారు. అత్యవసర, చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఉద్యోగులు సెలవు తీసుకోరాదని, సోమ, మంగళవారాల్లో కచ్చితంగా విధులకు హాజరుకావాలని ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బంద్ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు పనిచేస్తాయని చెప్పారు.
బంద్‌లకు తాము వ్యతిరేకమని, పెద్దనోట్ల రద్దును వ‍్యతిరేకిస్తూ సోమవారం నాడు నిరసన ప్రదర్శనలో పాల్గొంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా భద్రత కల్పించాలని చెప్పారు.