మీరు ఎలాంటివాళ్లో మీ ఫేస్బుక్ చెప్పేస్తుంది!
ఫేస్బుక్.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారినైనా దగ్గర చేయగలిగే బలమైన సోషల్ మీడియా. మనసులోని భావాలను పంచుకునే మంచి మిత్రుడు.. అనుకున్నది రాసుకునే అక్షరాల వేదిక. ఇలా ఫేస్బుక్ గురించి అడిగితే ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెప్పేస్తారు. అయితే లండన్కు చెందిన సైకాలజిస్టులు మాత్రం... ఫేస్బుక్లో చేసే పోస్టింగులను బట్టి వారి వారి మనస్తత్వాలను ఇట్టే పసిగట్టేయచ్చంటున్నారు.
ఫేస్బుక్లో క్రమం తప్పకుండా పోస్టింగులు చేసేవారు అభద్రతాభావం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. లండన్లోని బ్రూనెల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కొత్త అధ్యయనం ఫేస్బుక్లో తరచుగా పోస్ట్ చేసేవారి మనస్తత్వాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని వెల్లడించింది.
వారి వారి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి, వ్యాయామాల గురించి ఎక్కువగా పోస్ట్ చేసేవారు అహంభావంతో ఉంటారని, వారు ఎక్కువగా లైక్ లు, కామెంట్స్ ఆశిస్తారని ఐరిష్ ఇండిపెండెంట్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా జనం.. తమకు వచ్చే రెస్పాన్స్ను బట్టి తగిన విషయాలను మాత్రమే ఫేస్బుక్లో రాస్తుంటారని బ్రూనెల్ విశ్వవిద్యాలయం సైకాలజీ లెక్చరర్ తారామార్సల్ వెల్లడించారు. ఎక్కువ లైకులు, కామెంట్లు పొందేవాళ్లకు ప్రజాసంబంధాల ప్రయోజనాలు కూడా బాగా వస్తాయని, అదే అవి పొందని వాళ్లు మాత్రం ఒంటరితనాన్ని ఫీలవుతారని చెప్పారు.
ఇక అహంభావంతో పోస్టింగులు పెట్టేవాళ్లకు వాళ్ల ఫేస్బుక్ స్నేహితులు ఏదో తప్పదన్నట్లు లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడం చేసినా, లోపల లోపల మాత్రం వాళ్ల అహంభావాన్ని తిట్టుకుంటూనే ఉంటారట. మనం చేస్తున్న స్టేటస్ అప్డేట్లను స్నేహితులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనం వాళ్లను ఆహ్లాదంగా ఉంచుతున్నామా.. బోరు కొట్టిస్తున్నామా అనే విషయం తెలుసుకోవచ్చని వివరించారు.