నిర్బంధ విద్యా హక్కు చట్టం వచ్చి ఐదేళ్లు కావొస్తున్నా దాని అమలుకు చర్యలు తీసుకోకపోవడంపట్ల రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది.
సాక్షి, హైదరాబాద్: నిర్బంధ విద్యా హక్కు చట్టం వచ్చి ఐదేళ్లు కావొస్తున్నా దాని అమలుకు చర్యలు తీసుకోకపోవడంపట్ల రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ప్రవేశాలు కల్పించాలని చట్టం చెబుతున్నా అది అమలయ్యేలా ఏర్పాట్లు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. ఇందుకోసం మండల స్థాయిలో యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఒత్తిడి చేయకుండా పేద విద్యార్థులకు 25 శాతం ప్రవేశాలు కల్పించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘానికి సూచించింది.
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బలహీనవర్గాల విద్యార్థులకు 25 శాతం మేర ప్రవేశాలు కల్పించాలని ప్రైవేటు విద్యా సంస్థలను ఆదేశించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాన్ఫడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్ (కోవా), మరో రెండు సంస్థలు హైకోర్టులో పిల్ దాఖలు చేశాయి.
ఈ వ్యాజ్యంపై గురువారం వాదనల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ విద్యా హక్కు చట్టం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ చట్టం కింద ప్రతి పాఠశాలలో కమిటీలు ఉన్నాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘మాకు కావాల్సింది తల్లిదండ్రుల కమిటీలు కాదు. పేద విద్యార్థులకు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో దక్కాల్సిన 25 శాతం సీట్లు దక్కేలా చూసేందుకు అవసరమైన కమిటీలు.
ఒకవేళ ఏదైనా పాఠశాల పేద విద్యార్థికి సీటును నిరాకరిస్తే ఆ విద్యార్థి ఫిర్యాదును, బాధను వినేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తే బాధితులు ఆ కమిటీలను ఆశ్రయించి న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి’ అని అభిప్రాయపడింది. కాగా, ఈ కేసులో తాము ప్రతివాదిగా చేరేందుకు అనుమతివ్వాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం తరఫు న్యాయవాది నాగేశ్వర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు.
పేదల విద్యార్థులకు చట్ట ప్రకారం 25 శాతం సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని... అయితే ఆయా విద్యార్థులకు చట్ట ప్రకారం ఫీజు రీయింబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలోనే తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది షకీల్ స్పందిస్తూ పాతబస్తీ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు 74 మంది విద్యార్థులకు ప్రవేశాలు తిరస్కరించాయంటూ ఆ విద్యార్థుల వివరాలను ధర్మాసనం ముందుంచారు. వివరాలు తీసుకున్న ధర్మాసనం...ఆయా పాఠశాలలు మీ సంఘంలో ఉన్నాయో లేదో చూడాలని నాగేశ్వర్‌రెడ్డికి స్పష్టం చేసింది.