ప్రభుత్వానికి అధికారం ఉందో లేదో తేలుస్తాం | Whether or not the authority of the government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి అధికారం ఉందో లేదో తేలుస్తాం

Published Fri, Feb 5 2016 1:56 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ప్రభుత్వానికి అధికారం ఉందో లేదో తేలుస్తాం - Sakshi

ప్రభుత్వానికి అధికారం ఉందో లేదో తేలుస్తాం

* అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణపై హైకోర్టు
* సుప్రీంకోర్టు తీర్పులను మా ముందుంచండి
* అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ సరికాదు
* ప్రస్తుతానికిదే మా ప్రాథమిక అభిప్రాయం.. తేల్చి చెప్పిన ధర్మాసనం
* తదుపరి విచారణ 8కి వాయిదా...
* జీవోపై స్టేకి నిరాకరణ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏదైనా ఒక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింప చేసుకుంటే (అడాప్ట్) ఆ చట్టాన్ని అధికార ఉత్తర్వు ద్వారా సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందో లేదో తేలుస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది.

ఈవిధంగా అధికార ఉత్తర్వు ద్వారా సవరణలు చేస్తూ పోతే భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. అంతిమంగా దీనికి ఓ సమాధానం చెబుతామని స్పష్టం చేసింది. ఒకసారి అడాప్ట్ చేసుకున్న చట్టానికి తరువాత అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఉంటే వాటిని తమ ముందుంచాలని అటు పిటిషనర్ల తరఫు న్యాయవాదులను, ఇటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

ఈ నెల 11న మేయర్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసిన నేపథ్యంలో, అధికార ఉత్తర్వుల (జీవో 207)పై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. 8న పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నందున స్టే అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన తరువాత కూడా తమ ఓటును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోకి మార్చుకున్న ఎమ్మెల్సీలందరికీ ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు వీలు కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టానికి అధికార ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) ద్వారా సవరణ చేస్తూ జారీ చేసిన జీవో 207ను సవాల్‌చేస్తూ కాంగ్రెస్ ముఖ్యఅధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా పిటిషన్ దాఖలు చేసింది.

ఈ రెండు వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. చట్టాన్ని అడాప్ట్ చేసుకునే సమయంలోనే మార్పులు, చేర్పులు, సవరణలు చేయాలని, ఒకసారి అడాప్ట్ చేసుకున్న తరువాత సవరణలు చేయాలంటే అది శాసనవ్యవస్థ ద్వారానే జరగాలన్నది తమ ప్రాథమిక అభిప్రాయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటే, అపాయింటెడ్ డే నుంచి రెండేళ్లలోపు ఆ చట్టానికి సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

ఇదే విషయాన్ని బిహార్ పునర్విభజన చట్టం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంటూ ఆ తీర్పును చదివి వినిపించారు. సెక్షన్ 101 కింద తమకున్న అధికారంతో ఈ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన చెప్పగా, దీంతో ధర్మాసనం ఏకీభవించలేదు. తరువాత శ్రవణ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీం తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ట్ర చట్టాలు కొత్త రాష్ట్రానికి వర్తిస్తాయని, రెండేళ్ల వరకు వాటిని అడాప్ట్ చేసుకోవడం, వాటికి మార్పులు చేర్పులు చేయడం, సవరణలు చేపట్టడం లాంటివి చేయొచ్చని, అయితే ఇదంతా కూడా అడాప్ట్ చేసుకున్న సమయంలోనే జరగాలని చెప్పారు.

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, శాసనవ్యవస్థ ద్వారా చేయాల్సిన పనిని ప్రభుత్వం అధికార ఉత్తర్వు ద్వారా చేసిందని, ఇది చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. దీనికి ఏజీ స్పందిస్తూ, అయితే విచారణను సోమవారానికి వాయిదా వేయాలని, సుప్రీం తీర్పులను కోర్టు ముందుంచుతానని ప్రతిపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement