మీరు కుమ్మక్కవుతూ.. నా వైపు వేలు చూపుతారా? : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: 16 నెలలు తాను జైల్లో ఉన్నపుడు ఓవైపు రకరకాలుగా ఇబ్బందులు పెడుతూనే.. కుమ్మక్కు రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికి తమపై వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అలాంటి ఆరోపణలు చేస్తున్న వారిని నేనొక్కటే ప్రశ్నిస్తున్నా... ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు..? అయ్యా ఒక్కసారి గతాన్ని తిరగేయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన శంకర్రావు నాపై రిట్ పిటిషన్ (నంబర్694) దాఖలు చేశారు. టీడీపీకి చెందిన అశోక్‌గజపతిరాజు, ఎరన్న్రాయుడు.. వీరిద్దరూ కలిసి నాపై 7794 అనే మరో పిటిషన్ వేశారు. వీరిద్దరూ శంకర్రావుతో కలిసి కోర్టుకు వెళ్లారు. ఆ రిట్ పిటిషన్లను ఒకసారి పరిశీలిస్తే కామాలు, పుల్‌స్టాపులు కూడా మారకుండా ఒకటిగానే ఉంటాయి. ఇద్దరూ కోర్టుకు వెళ్లి ఒక చనిపోయిన వ్యక్తి మీద (దివంగత వైఎస్‌పైన).. ఆయన చనిపోయిన 18 నెలల తరువాత.. ఆ వ్యక్తి ఇక రాడు, ఇక లేడు అన్నపుడు.. ఆ వ్యక్తి కొడుకు, కాంగ్రెస్ వీడిన రెండు నెలల తరువాత.. ఆ వ్యక్తిని దెబ్బకొట్టడం కోసం చనిపోయాడన్న కనీస ఇంగితం కూడా మర్చిపోయి ఇద్దరూ కలిసి కోర్టుకు వెళ్లి రిట్లు వేసింది వాస్తవం’’ అని ఆయన గుర్తుచేశారు.
ఆ రోజు కోర్టుకు ఎందుకు జవాబు చెప్పలేదు?
‘‘కోర్టులో కేసులు వేసిన తర్వాత కోర్టు సమన్లు ఇచ్చింది. నన్ను 52వ రెస్పాండెంట్‌గా కోర్టు సమన్లు ఇస్తుంది. మొదట 1 నుంచి 19 దాకా ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టు జవాబు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ శాఖలు జవాబు ఇవ్వాల్సి ఉన్నా.. కావాలని జవాబు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. ఎందుకు తప్పుదోవ పట్టించింది? ఎందుకు మీరు జవాబు ఇవ్వలేక పోయారు? ఒకవేళ జవాబిస్తే.. ‘అన్నీ బిజినెన్‌స రూల్స్ ప్రకారం జరిగాయి.. చంద్రబాబునాయుడు గారి హయాంలో కూడా ఇలాంటివి అనేకం జరిగాయి’ అని చెప్పాల్సి వస్తుందని ఏమీ జవాబివ్వలేదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అలా చేసింది. ఫలితంగా కోర్టు విచారణకు ఆదేశించింది. ఆదేశించిన తరువాత కేవలం 14 రోజుల్లో నా ఇళ్లమీద సోదాలు చేసి అందరినీ ఇబ్బందులు పెట్టారు. ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అదే చంద్రబాబేమో కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి కోర్టుకు వెళతారు. అంతేకాదు.. కోర్టుకు వెళ్లిన తరువాత సమాచార హక్కు కమిషనర్ల పదవులను కలిసి పంచుకునే యత్నం చేస్తారు. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసికట్టుగా పోటీ చేస్తారు.
ఉప ఎన్నికల్లో కూడా కలసికట్టుగా పనిచేస్తారు. చంద్రబాబు గారి మీద ఐఎంజీ కేసుల్లోనూ ఎమ్మార్ కేసుల్లోనూ విచారణ జరక్కుండా జాగ్రత్త పడతారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా కూడా నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరు కూడా చేయిస్తారు. అదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న రూ. 32 వేల కోట్ల భారం ప్రజలపై వేసి కరెంటు చార్జీలను బాదితే.. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాళ మొత్తం ప్రతిపక్షాలన్నీ కలసి అవిశ్వాస తీర్మానం పెడితే.. చంద్రబాబు మాత్రం ఏకంగా విప్ జారీ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతారు.
నేనొక్కటే అడగదల్చుకున్నా... ఎవరయ్యా! ఎవరితో ఎవరు కుమ్మక్కు అయ్యారు? ఇవాళ రాష్ట్రాన్ని విడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ.. ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నది చంద్రబాబు.. వ్యతిరేకిస్తున్నది మేము. ఎఫ్‌డీఐలో ఓటింగ్ జరుగుతున్నపుడు వ్యతిరేకించింది మేమే. అనర్హతకు గురవుతామని తెలిసి కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసింది మేము. కాంగ్రెస్ విభజన చేస్తాఉంటే వ్యతిరేకిస్తున్నది మా పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు? అని నేను అడుగుతున్నా’’ అని జగన్ తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు. ‘‘పదహారు నెలలుగా వీరు చెప్తున్న అబద్ధాలు చూసి చూసి బాధ కలిగింది. అందుకే ఇవాళ మీ ద్వారా కనీసం నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని భావించి ఆ బాధను కాస్తో కూస్తో వెలిబుచ్చా’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తో ఒప్పందమా! :
అలాగైతే 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది
‘‘నేను కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని ఉంటే పదహారు నెలలు జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుంది. (కాంగ్రెస్‌కూ, మీకూ మధ్య ఒప్పందం కుదిరినందునే బెయిల్‌పై విడుదలయ్యారంటున్నారని మీడియా సమావేశంలో విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన స్పందించారు.) ఒప్పందం ఉంటే నేనెందుకు 16 నెలలు జైల్లో ఉంటాను. నాది ఒప్పందాలు కుదుర్చుకునే స్వభావం కాదు. ఒప్పందాలు కుదుర్చుకునే వాడినైతే అసలు నేనెందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మీకిక్కడ వాస్తవాలు వివరిస్తాను... బెయిలు కోసం మేము సుప్రీంకోర్టుకు ఒకసారి కాదు, రెండుసార్లు వెళ్లాం. తొలిసారి వెళ్లినప్పుడు ఆరునెలల లోపు దర్యాప్తు ముగించండి అని గడువు పెట్టింది.
గడువులోగానే సీబీఐ చార్జిషీట్ వేస్తుందని భావించిన మా న్యాయవాదులు ఆరు నెలలు గడువు వద్దని కోరారు. కానీ దురదృష్టవశాత్తూ సీబీఐ చార్జిషీటు వేయలేదు. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాం. అప్పుడు మళ్లీ నాలుగు నెలలు గడువు విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీబీఐ కచ్చితంగా పాటించక తప్పదు కదా... ఆ ప్రకారమే చార్జిషీట్లు వేశారు. నాకు అర్థం కానిది ఒక్కటే. వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా మా మధ్య ఒప్పందం ఉందని ఎవరైనా ఎలా అంటారు? ఒక కేసులో మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి కానప్పుడు సదరు వ్యక్తి బెయిల్ పొందవచ్చని రాజ్యాంగమే స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగపరంగా బెయిలు పొందే హక్కు ఉంటుంది. అది జగన్ కావచ్చు, మీరు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇక్కడేమీ నేరస్తుడిగా రుజువు కాలేదు. అలాంటిది పదహారు నెలలు జైల్లో ఉన్న తరువాత బెయిలు వస్తే కూడా ఒప్పందం అని ఎలా అంటారన్నదే నాకు అర్థం కాని విషయం. ఇది నాపై రాజకీయంగా జరిగిన కుట్ర. రాజకీయ పార్టీలు నాపై కోర్టుకు వెళ్లాయి. ఈ యంత్రాంగాలను రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి. మూడు నెలల్లో రావాల్సిన బెయిల్‌ను రాకుండా పదహారు నెలలు సాగదీశారు. ఇప్పుడు బెయిలు వస్తే ఒప్పందం అనే మాటలనడం నన్ను బాధిస్తున్నాయి..’’